ఓటు కోసం కోటి తిప్పలు

Apr 21,2024 02:40 #2024 elections, #TDP, #YCP
  • సంక్షేమం..అభివృద్ది..సమస్యలు అన్నీ పక్కదారి..
  • గెలుపు కోసం ప్యాకేజీలు, చేరికలు, ఫిరాయింపులు
  • సోషల్‌ ఇంజినీరింగ్‌ పేరుతో కులాల కుంపటు

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : నిన్నామొన్నటి వరకూ నేతల ఉపన్యాసాల్లో వినిపించిన సంక్షేమ ఎజండా పక్కదారి పట్టింది. జిల్లా సమస్యలపై చర్చ లేదు. పెండింగ్‌ ప్రాజెక్టుల ఊసే లేదు. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావనే కరువైంది. తెలుగుదేశం, వైసిపి అభ్యర్థుల నోట ఇప్పుడు ఇవేవీ వినిపించడం లేదు. అధినేత సభల్లోనే వీటి గురించి ప్రస్తావనలు కనిపించాయి. సిఎం జగన్‌, చంద్రబాబు.. ఇద్దరూ జిల్లాలో సభలు నిర్వహించి వెళ్లారు. వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు నామినేషన్ల పర్వం మొదలైంది.

ఎవరిని ఎలా…?
ఏఏ వర్గాలను ఎలా రాబట్టుకోవాలన్న దానిపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. అనేక ప్రలోభాలకు తెరలేపారు. అసంతృప్తిగా ఉన్న నేతలకు ప్యాకేజీలు ఇస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా చేరికలు పేరుతో పార్టీల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో నిత్యం ఇదే తరహా కార్యక్రమాలు రోజూ జరుగుతున్నాయి. ఒక పార్టీలో ఉంటూ అసంతృప్తిగా ఉన్ననేతలను ప్యాకేజీలతో లాగేస్తున్నారు. తెల్లారేసరికి పార్టీలు ఫిరాయిస్తున్నారు. వీళ్లంతా మండలస్థాయి నేతలే ఎక్కువగా ఉంటున్నారు. రూ.5 లక్షల నుంచీ నేతల స్థాయి, జనంలో ఉన్న పలుకుబడిని బట్టి రూ.25 లక్షల వరకూ ఇస్తున్నారు. ఒంగోలు నగరంలోని కార్పొరేటర్లకు రూ.3 లక్షలు, డివిజన్‌ బాధ్యులకు లక్ష రూపాయలు చొప్పున ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్యాకేజీలు ఇచ్చారు. వారందరినీ దారిలోకి తెచ్చుకునే వ్యూహాన్ని ఇలా అమలుచేశారు. అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఉన్నందున సమీకరణల్లో మార్పుల కోసం ఈ తరహా విధానాలను అమలు చేస్తున్నారు. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి కొనసాగుతోంది.

ఇప్పుడు హామీలిస్తే నమ్మరనే…
కనిగిరి ప్రాంతంలో ఫ్లోరిన్‌ పీడితులను కాపాడేందుకు ఎటువంటి కార్యాచరణలు కనిపించడం లేదు. ఎన్నికల నాటికి ఇంటింటికీ కుళాయి వేస్తామన్నారే తప్ప ఆచరణలో జరగలేదు. ఇప్పటికీ జిల్లాలో తాగునీటి ఎద్దడి కొనసాగుతోంది. ట్యాంకర్లతోనే నీటిని అందించే గ్రామాలు వందల్లో ఉన్నాయి. పట్టణాల్లోనూ భారీ తాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఒంగోలు పట్టణంలో ఇప్పటికీ మూడు రోజులకోసారే నీరు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భారీ తాగునీటి పథకం ఇప్పటికీ పూర్తికాలేదు. పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచారంలోనూ వినిపించడం లేదు. పూర్తిచేస్తామనే మాటలు కూడా దరిదాపుల్లో లేవు. ఎందుకంటే ఇరవై ఏళ్లుగా చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు చెబితే జనం నమ్మరనే భావనకు వచ్చేశారు. అందుకే ఓట్ల కోసం వాటిని వదిలేసి ప్యాకేజీలు, సామాజిక ఎజెండాలు, కొనుగోళ్లు, మద్యం, డబ్బుతోనే నడుస్తున్నారు. నామినేషన్లకు వాహనాలు పెట్టి జనానికి మద్యం డబ్బులు ఇచ్చి భారీగా తరలిస్తున్నారు. నామినేషన్‌ రోజునే ఒక్కో అభ్యర్థికి రూ.రెండు కోట్ల వరకూ ఖర్చవుతోంది. ఇలా ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.

➡️