అడవిని వీడి జనారణ్యంలోకి!

Dec 14,2023 08:52 #Crop Damage, #elephant, #Tirupati
elephant damage crop in v kota

పల్లెసీమలో ఏనుగుల కలవరం
పంటలు కాపాడుకొనేందుకు రాత్రింబవళ్లు జాగారం
అధికారులు, పాలకులపై విమర్శల వెల్లువ

ప్రజాశక్తి-వికోట : కీకారణ్యంలో ఉండాల్సిన ఏనుగుల మంద.. ఊళ్లు.. పంటలపై దూసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తు న్నాయి. పొలాలను తొక్కేస్తూ.. రైతులను చంపే స్తూ పల్లెసీమలను కలవర పెడుతున్నాయి. సత్యమంగళం అడవుల నుంచి వేర్వేరుగా విడిపడి.. గుంపు గుంపులుగా శేషాచలం, కౌండిన్యా అటవీ ప్రాంతాల్లో తిష్టవేశాయి. గత ఏడాది శేషాచల అటవీ పరివాహక ప్రాంతాల్లోని తిరుపతి, పిచ్చాటూరు, నాగలాపురం, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో దాడులు చేశాయి. ఈ ఏడాది కౌండిన్య అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకొని గుంపుల్లో విడిపడి తిరుపతి జిల్లా పాకాల మొదలుకొని చిత్తూరు జిల్లా పుంగ నూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చే పంటలను నాశనం చేస్తుంటే అన్నదాతలు లభోదిబోమంటూ విలపిస్తున్నారు. ఎదురుపడ్డ రైతులు, పశువుల కాపరులను చంపేస్తుండటంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. అటవీశాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో ఏనుగుల దాడులు కొనసాగుతూ తీవ్రనష్టం కలిగిస్తుండటంతో వారి నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సరిహద్దులో గజగజ

కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులో సోమవారం 50-60 ఏనుగుల మంద హోసూరు నుంచి వచ్చినట్లు కలకలం రేగింది. ఇప్పటికే పుంగనూరు ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు, రామ కుప్పం వద్ద రెండు ఏనుగులు, బంగారుపాళ్యం వద్ద మరో గుంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవికాక మరో ఏనుగుల మంద వచ్చిందన్న సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో పంటలు పండించిన రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పల్లెల్లో ఏనుగులొస్తున్నా యంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల కదలికలు ఉండడంతో అధికారులూ అప్రమత్తం అయ్యారు.

పంటలపై దాడులు

నిత్యం పంటలపై ఏనుగులు దాడులు చేసి నాశనం చేస్తూ రైతులను ముంచేస్తున్నాయి. అరటి, వరి, టమోటా, బొప్పా యి, మామిడి, మొక్కజొన్న తోటల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఇవి కాక డ్రిప్‌పైపులు, పైపులు వంటివి ధ్వంసం చేస్తున్నాయి. నిత్యం పొలాల్లో దాడులు జరుగుతుండటంతో రైతులు పంటలను కాపాడుకోలేక, ఇటు ఏనుగుల గుంపును మల్లించలేక రాత్రింబవ ళ్లు జారారాలు చేయాల్సి వస్తోందని కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రశ్నార్థకంగా ఎలిఫెంట్‌ శాంక్చురీ

పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలో 360 చదరపు కిలోమీటర్లు, విస్తీర్ణంలో 88400ఎకరాల్లో కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీని 1990లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి సురక్షితమని అధికారులు గుర్తించారు. అందుకు ఏర్పాట్లు చేసిన ప్పటికీ నిర్వహణ లోపం వల్ల గజరాజులు అటవీ ప్రాంతాలను వీడి పంటలపైకి దూసుకొస్తున్నాయి. గడిచిన 30ఏళ్లలో సుమారు 60మందికి పైగా గజదాడుల్లో మృత్యువాత పడినట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

పరిష్కార మార్గానికి ఆలస్యం

వెనువెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిష్కార మార్గాన్ని అన్వేషించకుంటే ముప్పు తప్పేలా లేదని విశ్లేషకుల భావన. ప్రజలను, పంటలను, ఏనుగలను కాపాడటం నిత్యకృత్యం. పెద్ద ఎత్తున కుంకీ ఆపరేషన్‌ చేపట్టి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాల్లో పంపాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. పంట పొలాలపైకి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సోలార్‌ ఫెన్సింగ్‌ వంటివి ఏర్పాటు చేసి ప్రత్యా మ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.పంటపైకి వస్తున్న ఏనుగులు విద్యుత్‌ షాక్‌ తగిలి మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని గాయాలపాలై.. ఇంకొన్ని వివిద కారణాలతో మరణిస్తున్నాయి. ఏనుగులు వరుస మరణాలు వాటి భవిష్యత్‌కు కూడా ముప్పే.

➡️