విద్య, సంపదలతో ముడిపడిన సంతానోత్పత్తి రేటు

Apr 29,2024 15:51 #Education, #Fertility rate, #Wealth

న్యూఢిల్లీ :   సంతానోత్పత్తి రేటు విద్య, సంపదలతో ముడిపడి ఉందని ఓ సర్వే తేల్చింది. అధిక ఆదాయ స్థాయిలు, పాఠశాలలో అత్యధిక సంవత్సరాలు ఉన్న వ్యక్తి కుటుంబ పరిమాణం, సంతానంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. సంపద, విద్య ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల్లోని మహిళల సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఇతర కారకాలతో పోలిస్తే.. మతం పాత్ర మరింత పరిమితంగానే ఉంటుందని సర్వే స్పష్టం చేసింది.

అత్యంత సంపన్నులైన 20 శాతం మంది ప్రజల్లో… మొత్తం సంతానోత్పత్తి రేటు 1.6 శాతం ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) తెలిపింది. కిందిస్థాయిలో ఉన్న 20 శాతం ప్రజల్లో ఈ రేటు 2.6 శాతానికి పెరిగినట్లు తెలిపింది. 2019-21లో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ -ఐదవ రౌండ్‌లో ఈ సర్వే చేపట్టింది.
12 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ పాఠశాల విద్య కలిగిన మహిళల్లో వారి జీవిత కాలంలో సగటున 1.78 మంది పిల్లలను కలిగి ఉన్నారు. పాఠశాలలో గడపని మహిళలు 2.82  మంది పిల్లలను కలిగి ఉన్నారు.

ప్రాంతాల వారీగా కూడా సంతానోత్పత్తి రేటులో తేడా అధికంగా ఉంది. గ్రామాల్లో నివసించే నిర్దిష్ట సమూహం (20 శాతం మంది ప్రజలు) పట్టణ ప్రాంతాల్లో నివసించే వారితో పోలిస్తే అధిక సంతాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ మతానికి సంబంధం లేదు. హిందువుల్లో అధిక సంతానోత్పత్తి కలిగి ఉన్న జిల్లాల్లో ముస్లింలు కూడా అధిక సంతాన్ని కలిగి ఉన్నారు. అదే విధంగా తక్కువ సంతానోత్పత్తి ఉన్న హిందువులు నివసించే జిల్లాల్లో ముస్లింలు కూడా తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నారు.

హిందూ – ముస్లిం  ఫెర్టిలిటీ డిఫరెన్షియల్స్‌ ఇన్‌ మేజర్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఇండియా : ఇన్‌డైరెక్ట్‌ ఎస్టిమేషన్‌ టెట్‌ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ ఫ్రమ్‌ సెన్సస్‌ 2011′ పేరుతో కేంద్ర ఆరోగ్య రంగానికి చెందిన సస్వతా గోష్‌ ఈ సర్వే నివేదికను విడుదల చేశారు.

సాధారణంగా సంతానోత్పత్తి తక్కువగా ఉన్న ఏ జిల్లాలో అయినా ముస్లిం మహిళల్లో ఈ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ముస్లిం జనాభా హిందువులతో (4.9 సంవత్సరాలు) పోలిస్తే, 4.3 సంవత్సరాలు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. అదే సిక్కుల్లో 7 సంవత్సరాలు ఉండగా, క్రిస్టియన్‌లలో 7.2 సంవత్సరాలు, జైనులు 9.8 సంవత్సరాలు. ముస్లిం జనాభాలో ఎక్కువ భాగం హిందువుల (20.5 శాతం) తర్వాత (19.6 శాతం) అత్యల్ప సంపదను కలిగి ఉన్నారు.

ముస్లిం మహిళలు ఈ దశాబ్దంలో తక్కువ సంతానాన్ని కలిగి ఉండటమే కాకుండా, గతంలో కన్నా ఎక్కువ జననాల మధ్య అంతరాన్ని ఎంచుకుంటున్నారు. ఓ ముస్లిం మహిళ (40-49 ఏళ్ల వయస్సు) తన జీవిత కాలంలో 5.83 సంతానాన్ని కలిగి ఉన్నట్లు ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ (1992-93) మొదటి సర్వే తెలిపింది. తాజా సర్వేలో (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) ఈ నిష్పత్తి 3.6గా ఉంది. అదే సమయంలో హిందూ మహిళలో సంతానం సంఖ్య 4.78 నుండి 2.92కి పడిపోయింది. భారత్‌లో సగటున ఒక్కో మహిళ కలిగి ఉన్న పిల్లల సంఖ్య ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-1లో 4.84తో పోలిస్తే .. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5లో 2.98కి పడిపోయింది.

ముస్లిం మహిళల జనన అంతరం కూడా గణనీయంగా పెరిగింది. జననం మధ్య అంతరం హిందూ మహిళలు (32 నెలలతో) పోలిస్తే ముస్లిం మహిళలకు 34 నెలలకు పెరిగింది. ఓ భారతీయ మహిళకు మధ్యస్థంగా 33 నెలల జనన విరామం ఉన్నట్లు సర్వే తేల్చింది.

➡️