‘కొల్లేరు’కు వరద!

Dec 12,2023 11:18 #floods, #Kolleru
  • అగమ్యగోచరంగా కొల్లేరు ప్రాంత గ్రామాల్లో దాళ్వా సాగు

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : కొల్లేరుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిచౌంగ్‌ తుపానుతో కురిసిన భారీ వర్షాల వల్ల కొల్లేరుకు వరదనీరు పోటెత్తడంతో దాళ్వాసాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రోజురోజుకీ వరద నీరు పెరగడంతో ఇప్పటికే వేసిన నారుమడులన్నీ ముంపునకు గురయ్యాయి. నారుమడులను వరద నీటి నుంచి కాపాడుకునే అవకాశం లేకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కొల్లేరుకు ఆనుకుని నిడమర్రు, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, కైకలూరు, ఆకివీడు వంటి మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు చెందిన పలు గ్రామాలకు చెందిన పొలాలు కొల్లేరుకు ఆనుకుని ఉన్నాయి. ఐదో కాంటూరుకు పైన పట్టాభూములతోపాటు అనసరి భూములు ఉన్నాయి. ఈ మండలాల్లో దాదాపు నాలుగైదు వేల ఎకరాలకుపైగా భూముల్లో రైతులు దాళ్వాలో వరిసాగు చేస్తుంటారు. వర్షాలు, వరదల కారణంగా కొల్లేరుకు ఆనుకుని ఉన్న భూముల్లో రైతులు ఖరీఫ్‌ పంట సాగు చేయరు. దాళ్వా మాత్రమే సాగు చేస్తారు. దీంతో ఇప్పటికే నిడమర్రు మండలం అడవికొలనుతోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు దాళ్వా నారుమడులు వేయడం జరిగింది. తుపాను దెబ్బకు కొల్లేరుకు వరద నీరు పోటెత్తడంతో నారుమడులన్ని మునిగిపోయాయి. ఎకరాకు రూ.రెండు వేలకుపైగా రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. వరద పోటు ఇప్పటికీ తగ్గకపోవడంతో దాళ్వా సాగుపై అయోమయం నెలకొంది. రెండోసారి నారుమడులు వేస్తే తప్ప దాళ్వాసాగు చేసేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది.

కొల్లేరుకు ఆనుకుని ఉన్న పొలాలన్నీ సన్న, చిన్నకారు రైతులకు సంబంధించినవే 80 శాతం ఉన్నాయి. దాళ్వా సాగు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మళ్లీ దాళ్వా వరకూ సాగు చేసుకునే అవకాశం ఉండదు. దీంతో రైతులకు ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.నెలాఖరుకు నారుమడులు పూర్తయ్యేనా?చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వరద నీరంతా కొల్లేరులోకి ప్రవేశిస్తోంది. దీంతో కొల్లేరుకు వరదనీరు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొల్లేరు పొలాల్లో నడుము లోతు వరకూ వరద నీరు చేరినట్లు రైతులు చెబుతున్నారు. డిసెంబర్‌ నెలాఖరుకు కూడా నారుమడులు పూర్తవుతాయో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే దాళ్వా పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ నెలాఖరుకు నారుమడులు పూర్తయితే ఫిబ్రవరి 15వ తేదీ వరకూ నాట్లు వేయాల్సి ఉంటుంది. ఇంకా నారుమడులు ఆలస్యమైతే నాట్లు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు మే నెలాఖరుకు పంట చివరిదశకు చేరుకుంటుంది. అప్పుడు అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు రైతులను వెంటాడనున్నాయి. అంతేకాకుండా నాట్లు ఆలస్యమైతే దిగుబడి సైతం తగ్గే పరిస్థితి ఏర్పడనుంది. దీంతో కొల్లేరుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతుల పరిస్థితి అయోమయంగా మారింది.

➡️