సమ్మె హామీలకు జిఓలు

Mar 16,2024 10:13 #guarantees, #strike

– 42 రోజులకు వేతనాలు చెల్లింపు శ్రీ వర్కర్లపై కేసుల ఎత్తివేత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు, మున్సిపల్‌ వర్కర్ల సమ్మె సమయంలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంగన్‌వాడీలకు సమ్మెకాలంలో వేతనాలు చెల్లించనున్నారు. మున్సిపల్‌ వర్కర్లపై నమోదు చేసిన కేసులనూ ఎత్తేయనున్నారు. అంగన్‌వాడీలు 42 రోజుల సమ్మె కాలాన్ని సానుభూతి కింద పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జిఓ ఎమ్‌ఎస్‌ 12 జారీ చేసింది. దీంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం నిమిత్తం సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ జిఓ ఎమ్‌ఎస్‌ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వీటితోపాటు మినీ సెంటర్లకు సంబంధించిన జిఓను కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా అంగన్‌వాడీ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలకు, హెల్పర్‌కు రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయటంతోపాటు, అంగన్‌వాడీలపై పెట్టిన కేసులను కూడా రద్దు చేయాలని వారు కోరారు. ఈ మేరకు డైరెక్టరుకు వినతిపత్రం సమర్పించారు.

                                                              మున్సిపల్‌ కార్మికులపై కేసులు ఎత్తివేత

మున్సిపల్‌ కార్మికులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికులు గతేడాది డిసెంబరు 26 నుంచి ఈ ఏడాది జనవరి 11 వరకూ 16 రోజుల పాటు సమ్మె కొనసాగించారు. ఈ సమ్మెలో భాగంగా కార్మికులు పలు ప్రదేశాల్లో ధర్నాలు, బైఠాయింపులు, తదితర పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కడప జిల్లాల్లో వివిధ సెక్షన్ల కింద మొత్తం ఆరు కేసులు నమోదు చేశారు. అనంతరం ప్రభుత్వంతో జరిగిన చర్చలు నేపథ్యంలో సమ్మెను విరమింపజేశారు. ఆ సమయంలో కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జిఓ 357 జారీ చేసింది. దీనిపై ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) హర్షం వ్యక్తం చేసింది. ఫెడరేషన్‌ ప్రధాక కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు స్పందిస్తూ, కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వంపై తాము తీసుకొచ్చిన ఒత్తిడి, మున్సిపల్‌శాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని తెలిపారు. ఇది కార్మికుల పోరాట విజయమని, సమ్మెకాలంలో పోలీసు నిర్బంధాన్ని, అధికారుల బెదిరింపులను ఎదుర్కొని వీరోచితంగా పోరాడిన కార్మికులకు ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు తెలిపారు. అలాగే కేసుల ఎత్తివేతకు కృషిచేసిన మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, డిఎంఎ శ్రీకేష్‌ బి లత్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

➡️