‘అనంత’లో హోరా హోరీ

May 6,2024 02:35 #anathapuram
  • అసెంబ్లీ బరిలో 113, పార్లమెంటుకు 21 మంది పోటీ

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోరు హోరా హోరీగా నడుస్తోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా సాగుతోంది. ఇండియా వేదిక సైతం ఆ రెండు పార్టీలకు బలమైన పోటీనిస్తోంది. అనంతపురం జిల్లా పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానముంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ పూర్తయి పోటీలో ఉండేది ఎవరన్నది స్పష్టమైంది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 113 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతపురం పార్లమెంటు స్థానానికి 21 మంది పోటీలో ఉన్నారు.

అనంతపురం జిల్లాలో తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ వంటి కీలకమైన మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఈసారి పోటీలో ఉన్నారు. ఈమెకు పోటీగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సిద్ధమయ్యారు. 1991 నుంచి ఓటమి అన్నది ఎరుగకుండా గెలుస్తూ వచ్చిన పరిటాల కుటుంబం 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేతిలో ఓటమిని చవి చూశారు. తిరిగి ఈ ఇద్దరే మరోమారు పోటీపడుతున్నారు. తాడిపత్రిలో జెసి దివాకర్‌రెడ్డి సోదరుడు కుమారుడు జెసి అస్మిత్‌రెడ్డి టిడిపి తరపున బరిలో ఉన్నారు. వైసిపి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెండోసారి బరిలో ఉన్నారు. 1985 నుంచి జెసి కుటుంబం తాడిపత్రిలో ఓటమి అన్నది లేకుండా గెలుస్తూ వచ్చింది. 2019లో జెసి కుటుంబ వారుసుడిగా జెసి అస్మిత్‌రెడ్డి తొలిసారి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో వైసిపి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు. ఇప్పుడు తానే గెలుస్తానని ధీమాను ఆయన వ్యక్తం చేస్తుండగా, తిరిగి తాము గెలిచి పట్టు నిలుపుకుంటామని జెసి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ జిల్లాలో ఉన్న మరో కీలకమైన నియోజకవర్గం ఉరవకొండ. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసిపి గాలి వీచినా ఇక్కడ టిడిపి తరపున పయ్యావుల కేశవ్‌ ఒక్కరే ఈ జిల్లాలో టిడిపి నుంచి గెలుపొందారు. తిరిగి మరోమారు గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసిపి నాయకులు వై విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆయన సోదరుడు వై మధుసూదన్‌రెడ్డి వైసిపి నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్నారు. రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు టిడిపి తరపున బరిలో ఉన్నారు. వైసిపి తరపున మాజీ ఎమ్మెల్యే మెట్టుగోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. వైసిపిలో టికెట్టు రాకపోవడంతో ఇక్కడ అంతకమునుపు ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి బిజెపిలో చేరారు. కూటమి తరపున కాలవ శ్రీనివాసులుకు ఆయన మద్దతునిస్తున్నారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రముఖ కాంట్రాక్టరు అమిలినేని సురేంద్రబాబు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు టికెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు వైసిపిలో చేరారు. వైసిపి అభ్యర్థి తలారి రంగయ్యకు మద్దతుగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ హోరా హోరీగానే సాగుతోంది.

గుమ్మనూరుకు సహాయ నిరాకరణ
గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపి నుంచి టిడిపిలో చేరి పోటీ చేస్తున్నారు. వైసిపి మాత్రం సిట్టింగు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డికే టికెట్టును ఇచ్చింది. వైసిపి నుంచి టిడిపిలో చేరిన గుమ్మనూరు జయరాంకు ఇక్కడి స్థానిక నాయకత్వం నుంచి కొంత సహాయ నిరాకరణ ఎదురవుతోంది. సొంత బలాన్ని నమ్ముకునే ఆయన గెలుపు కోసం పోటీ పడుతున్నారు. వై వెంకటరామిరెడ్డి మాత్రం రెండోసారి గెలుపునకు ప్రయత్నిస్తున్నారు. ఎస్‌సి రిజర్వు నియోజకవర్గమైన శింగనమలలో టిడిపి తరపున బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. గ్రూపు తగాదాలతో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పార్టీ అధినాయకత్వం కొంత చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గ్రూపులు కొంత తగ్గాయని చెప్పొచ్చు. ఇక వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవరు అంటూ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ రకంగా వైసిపి అభ్యర్థికి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. శింగనమల వైసిపి అభ్యర్థి వెనుక మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఉన్నారని, ఆయన ఈయన విజయం కోసం ప్రయత్నిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే సాంబశివారెడ్డిని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న వైసిపిలోని ఒక గ్రూపు ఇప్పటికీ ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తుండటం గమనార్హం. అనంతపురం అర్బన్‌లో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వైసిపి తరపున మరోమారు బరిలో దిగారు. టిడిపి అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్‌ను బరిలో దింపింది. విజయం కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇదే స్థానం నుంచి ఇండియా వేదిక అభ్యర్థిగా సిపిఐ నుంచి సి జాఫర్‌ బరిలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి.
బిజెపి పట్ల అటు వైసిపి, ఇటు టిడిపి అనుకూలంగా ఉంటున్నందున ఇండియా వేదిక వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసిపి తరపున మాజీ మంత్రి శంకర నారాయణ కాగా, టిడిపి నుంచి అంబికా లక్ష్మినారాయణ బరిలో ఉన్నారు.

➡️