కుత్సిత పథకం !

Mar 29,2024 04:55 #editpage

ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు గోప్యంగా వున్న ఎన్నికల ఫైనాన్సింగ్‌ వ్యవహారాలు స్పష్టంగా తెలియసాగాయి. కార్పొరేట్లు, వ్యక్తిగత దాతలు కొనుగోలు చేసిన, ఆ తర్వాత రాజకీయ పార్టీలు నగదు రూపంలోకి మార్చుకున్న ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎస్‌బిఐ విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సమాచారాన్ని విడుదల చేయడానికే ఎస్‌బిఐని కోర్టు రెండు సార్లు గట్టిగా మందలించాల్సి వచ్చింది. దాతలెవరు? అందుకున్న పార్టీలేవి? అన్న విషయాలు లేకుండా మొదటిసారి సమాచారం ఇచ్చిన సందర్భంలో బ్యాంక్‌ను కోర్టు మందలించింది. అయితే ఎస్‌బిఐ ఈ సమాచారం ఇవ్వడానికే 2024 జూన్‌ 30 వరకు (సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు) గడువు కోరింది. కాని, బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు, వాటిని నగదు రూపంలోకి మార్చుకున్న పార్టీల సమాచారాన్ని కలిపే సులభమైన డేటా మ్యాచింగ్‌ ప్రక్రియను వార్తా సంస్థలు చిటికెలో చేసేశాయి. ఈ డేటాను పరిశీలించినట్లైతే, ఎన్నికల బాండ్ల వివరాలు రహస్యంగా వుండాల్సిన అవసరం గురించి ప్రభుత్వం చేస్తూ వచ్చిన వాదనలోని డొల్లతనం వెల్లడవుతుంది. కోర్టు మాత్రం ఈ వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పెద్ద మొత్తంలో విరాళాలు నిర్దిష్ట రాజకీయ పార్టీలకు అందడం…బాండ్లు కొనుగోలు చేసిన వారికి పెద్ద ఎత్తున మౌలిక వసతుల కాంట్రాక్టులు రావడం చూస్తే…ఈ రెండింటికీ మధ్య స్పష్టమైన సంబంధం వుందని ఎవరికైనా చూస్తే అర్ధమైపోతుంది. కొన్ని సందర్భాలలో కంపెనీలు ఇ.డి, ఆదాయ పన్ను అధికారుల దాడులు, సోదాలను ఎదుర్కొనాల్సి రావడం…ఆ తర్వాత ఆ యా కంపెనీలు, వారి ప్రతినిధులు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం మధ్య కూడా గట్టి సంబంధమే వుంది. పాలక బిజెపి నగదు రూపంలోకి మార్చుకున్న బాండ్లను కొనుగోలు చేసిన చాలామంది దాతలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.
2019 మధ్య నుండి 2024 ఫిబ్రవరి వరకు 22 సంస్థలు రూ.100 కోట్లకు పైగా విరాళమిచ్చాయి. ఇవి ఇతర పార్టీలతో పాటుగా బిజెపికి నిరంతరం విరాళాలు ఇవ్వడం చూస్తుంటే తమ కంపెనీ/సంస్థకు అవసరమైన లేదా ప్రయోజనకరమైన పనులు చేసిపెట్టడానికి ఈ బాండ్లను ఒక సాధనంగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బాండ్ల విశిష్ట సంఖ్యల సమాచారం ఎస్‌బిఐ చేతిలో వుండడం వల్ల లావాదేవీల ఆడిట్‌ ట్రయల్‌ కొనసాగించడానికి అనుమతించగలగడం, అలాగే బాండ్ల గడువు తేదీ (కొనుగోలు చేసిన తేదీకి 15 రోజుల్లోగా) ముగిసిన తర్వాత కూడా కొన్ని బాండ్లను నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించడం చూస్తుంటే ఈ పథకం పాలక పార్టీకి లోపాయికారీ ప్రయోజనాలను పొందే అవకాశం కల్పించిందని అర్ధమవుతోంది. విరాళాల కోసం చిత్తశుద్ధిలేని ఉద్దేశాలపై ముసుగు వేయడంతో పాటుగా ఈ బాండ్లు పాలక పక్షానికి అనుకూలంగా ప్రచారం చేస్తూ, భారీగా ఆర్థిక సాయం అందించాయనేది స్పష్టమైంది. ఇక ఈ పథకం గురించి ఓటర్లను చైతన్యవంతులను చేయాల్సిన, విరాళాల కుటిల స్వభావాల గురించి ప్రశ్నలు లేవనెత్తాల్సిన గురుతర బాధ్యత పౌర సమాజంపై వుంది. వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే.
/’హిందూ’ సంపాదకీయం/

➡️