నిధుల్లేక నీరసం

  •  ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల పనులు
  •  ఐదేళ్లలో కేటాయింపులు ఘనం..ఖర్చు స్వల్పమే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రభుత్వం విస్మరించింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ అటకెక్కించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం నుండి కరువు ప్రాంతాలకు జలకళను పంచే హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టు, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇలా ప్రతి ప్రాజెక్టు నిర్మాణం ఈ ఐదేళ్లకాలంలో నిధుల్లేక నీరసించిపోయాయి. బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.61,573 కోట్లు చూపినా.. రూ.33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు తెలుపుతున్నాయి. తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ చేసింది లేదు. పునరావాసానికి నిధులివ్వని కేంద్రాన్ని నిలదీసిందీ లేదు. రెండు దశలుగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం మొదటి దశకు సంబంధించి 41.15 మీటర్లు వరకూ వుండే పునరావాసానికి కూడా నిధులివ్వలేదు. 2019 నాటికి పూర్తి చేస్తామని టిడిపి ప్రభుత్వం చెబితే, 2021 నాటికి పూర్తి చేస్తామని వైసిపి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసినా.. 2026 నాటికి గానీ మొదటి దశ పనులు పూర్తికావని కేంద్ర ప్రభుత్వం ఏకంగా పార్లమెంటులో ప్రకటన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరం ప్రాజెక్టును అటకెక్కించి నట్లే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి రెండు టన్నెల్‌ నిర్మాణాలు పూర్తయినా పునరావాసానికి సంబంధించి భూసేకరణ కోసం రూ.1,100 కోట్లు చెల్లించక పోవడంతో నీరు ఎప్పుడు వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజె క్టును అటకెక్కించేశారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించ కుండా కాంట్రాక్టరు మొండికేశారు. పనులు చేస్తే బిల్లులు రావనే కారణంతో చాలా పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పనులు చేయని పరిస్థితి వుంది. కొత్త ప్రాజెక్టులను అటకెక్కిం చడమే కాదు.. వున్న ప్రాజెక్టుల నిర్వహణకు నిధులివ్వలేదు. అలాగే పులిచింతల ప్రాజెక్టు, పించా డ్యామ్‌, అన్నమయ్య, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️