కాక పుట్టిస్తున్న ‘కాకినాడ’

May 5,2024 03:40 #2024 election, #Kakinada
  •  పిఠాపురంలో పవన్‌ పోటీతో ఆసక్తికరంగా మారిన పరిణామాలు
  •  తునిలో మారుతున్న సమీకరణలు శ్రీ సిటీలో ప్రలోభాల జోరు

ప్రజాశక్తి కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లా రాజకీయాలు తాజా పరిణామాలతో మరింత వేడెక్కాయి. వైసిపి కేడర్లో ఉత్సాహాన్ని నింపే పేరుతో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్‌ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్‌ విసరడంతో హీట్‌ మరింత పెరిగింది. ఇటీవల ముద్రగడ సొంత గ్రామం కిర్లంపూడిలో జరిగిన ఎన్నికల సభలో పవన్‌కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపి కనుసన్నల్లోనే నాడు కాపు రిజర్వేషన్‌ ఉద్యమం జరిగిందని విమర్శించారు. తుని రైలు ఘటనపైనా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. వీటిపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. కాపు ఉద్యమం, తుని ఘటనలపై పవన్‌కల్యాణ్‌కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దీంతో అటు జనసేన ఇటు వైసిపి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిఠాపురంలో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పవన్‌ అడుగులు వేస్తున్నారు. ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ, టాలీవుడ్‌ సెలబ్రిటీల సైతం కొద్ది రోజులుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.

రసవత్తరంగా మారిన తుని పోరు
మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తున్న తునిలో కూటమి, అధికార పార్టీల మధ్య రసవత్తర పోరు చోటుచేసుకుంది. ఇటీవల యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు సిఎం ముఖ్యమంత్రి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తన అన్న కూతురు దివ్యను ఓడించడమే లక్ష్యంగా రాజాకు మరోసారి అవకాశం కల్పించేందుకు తాను క్షేత్రస్థాయిలో పనిచేస్తానని చెబుతున్నారు. కృష్ణుడు రాకతో వైసిపికి బలం చేకూరగా, టిడిపికి గట్టి దెబ్బ తగిలింది. కృష్ణుడు తుని నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఆయన ఓటు బ్యాంకు కొంత వైసిపి వైపునకు మొగ్గే అవకాశం ఉంది.
కాకినాడ రూరల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఇక్కడ బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పంతం నానాజీ గట్టి పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించిన కన్నబాబు ఈసారి గట్టెక్కేందుకు ఎదురీదుతున్నారు. కీలక నియోజకవర్గంగా ఉన్న కాకినాడ సిటీలో మరోసారి పాగా వేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి కొండబాబు బలంగానే ఢ కొట్టేలా సమీకరణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్‌ రెడ్డి ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఎక్కువగా ఉంది. జగ్గంపేటలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు అసమ్మతి పోరు తప్పలేదు. జనసేన నేత సూర్యచంద్ర ఇక్కడ రెబల్‌ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో విజయం కోసం కూటమి కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది. వైసిపి నుంచి ఇక్కడ తోట నరసింహం పోటీలో ఉన్నారు. పెద్దాపురంలో మూడోసారి చినరాజప్ప విజయం సాధించాలనే తపనతో పనిచేస్తున్నారు. అయితే అతనికి సొంత పార్టీలోనే అసమ్మతి నెలకొంది. ఇటు వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబుపై ఉన్న వ్యతిరేకత ఏ పరిస్థితులకు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రత్తిపాడులో టిడిపి అభ్యర్థి వరుపుల సత్యప్రభకు సానుభూతి ఉండడంతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.

పార్లమెంటు దక్కేదెవరికి?
ఇండియా కూటమి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంఎం పల్లంరాజు ఎంపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్నిచోట్లా ఆయనకు పరిచయాలు ఎక్కువ. బంధుగణం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తనకున్న బలాలుగా పల్లంరాజు భావిస్తున్నారు. విభజన తర్వాత ఎపికి బిజెపి చేసిన అన్యాయాన్ని, కూటమి పేరుతో ఆ పార్టీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను, బిజెపితో అంటకాగుతున్న వైసిపి, టిడిపి వైఖరులను ఆయన ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ మాత్రమే ఉందని పల్లంరాజు చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ను బలపరచాలని కోరుతున్నారు. వైసిపి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌ కాకినాడ ఎంపి అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఆయన గతంలో మూడుసార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. వైసిపి నుంచి మరోసారి బరిలో ఉన్నారు. జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థిగా ఉదరు శ్రీనివాస్‌ మొదటిసారి పోటీలో ఉన్నారు. టీ టైమ్‌ అధినేతగా ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించిన తాను ఎంపిగా గెలిస్తే వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తానని చెప్పుకొస్తున్నారు. పైగా కూటమిలో కొంతమంది అభ్యర్థులు ఉదరుకు సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. దాంతో పవన్‌కల్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

➡️