పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం

Apr 29,2024 10:23 #liquor bottles, #States
  • గ్రామాల్లో డంప్‌లు
  • ఎన్నికల నేపథ్యంలో భారీగా పెరిగిన డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. పోటీలో నిలిచే అభ్యర్థులు వేలకు వేలు మద్యం కేసులను గ్రామాల్లో పెద్దయెత్తున డంప్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచే కాకుండా అదనంగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మద్యాన్ని అక్రమంగా తరలించి నిల్వలు చేస్తున్నారు. అబ్కారీశాఖ నేతృత్వంలో నడిచే షాపుల్లో అమ్మకాలు సాగించే సరుకు సరిపోక ఆయా రాజకీయ పార్టీలు ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని యథేచ్ఛగా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు ఇటీవల ఎస్‌ఇబి, పోలీసులు, ప్రత్యేక టీమ్‌లు జరిపిన దాడుల్లో వెలుగులోకి వచ్చింది. పిఠాపురంలో శుక్రవారం సెబ్‌, పోలీస్‌ అధికారులు దాడి చేసి సుమారు రూ.80 లక్షలు విలువ చేసే మద్యం నిల్వలను పట్టుకున్నారు. అలాగే తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.20.82 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థులు డంప్‌ చేసుకున్న నిల్వల్లో, పట్టుబడిన మద్యంలో కొంత శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చేసిన దాడుల్లో సర్వేపల్లి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం భారీ డంప్‌లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గన్నవరం మండలంలోని మెట్లపల్లిలోని మామిడి తోటల్లో నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లు (మద్యం), జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాలకు తెలంగాణ నుంచి మద్యం దిగుమతి అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో పక్కనే ఉన్న తమిళనాడు, గోవా నుంచి కూడా మద్యం రాష్ట్రానికి పెద్దయెత్తున దిగుమతి అవుతున్నట్లు సమాచారం. సెబ్‌, పోలీసులు సంయుక్తంగా అంతర్రాష్ట చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నప్పటికీ వారి కళ్లు గప్పి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రాష్ట్రంలోనూ పెరిగిన మద్యం అమ్మకాలు
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా భారీగా పెరిగా యి. గతేడాది మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో అమ్మకాలు పెరిగాయి. ఎన్నికల సీజన్‌ కావడంతో అధికారికంగా ఒక్క నెలలోనే దాదాపు 10 శాతం అమ్మకాలు పెరిగాయి.

➡️