మత్స్యకారులకు పరిహారం ఏదీ?

Apr 14,2024 08:13 #Any compensation, #fishermen

-నేటికీ విడుదల కాని పరిహారం మార్గదర్శకాలు
-రేపటి నుండి అమలులోకి చేపల వేట నిషేధం
-ఆందోళనలో గంగపుత్రులు

ప్రజాశక్తి- యంత్రాంగం : ఆటుపోట్ల జీవితంలో మరో ఉపద్రవం! ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా సముద్రంపై వేటకు వెళ్లలేని స్థితి ఒకవైపు! కష్టకాలంలో చేతికందవలసిన పరిహారం ఎప్పటికి అందుతుందో తెలియని స్థితి మరోవైపు! దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల జీవనానికి ‘భరోసా’ లేని పరిస్థితి ఏర్పడింది. జీవనం ఎలా సాగించాలో తెలియనిస్థితిలో మత్స్యకార కుటుంబాలు చిక్కుకున్నాయి. చేపలు గుడ్లు పెట్టే దశలో సముద్రంలో వేటాడితే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రతిఏటా వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా రేపటి (15వ తేది)నుండి జూన్‌ 14వ తేదివరకు నిషేధం అమలులోకి రానుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం విషయంలో సందిగ్ధం నెలకొంది. వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పేరుతో రైతులకు అందిస్తున్న ఈ పరిహారానికి సంబంధించి ఇంతవరకు మార్గదర్శకాలు జారీ కాలేదు. ఎప్పటికి విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో మత్స్యకారుల రోజువారి జీవనానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈ సమస్యపై అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు పెదవి విప్పడం లేదు. నామమాత్రంగానే ఇస్తున్న పరిహారమైనా మత్స్యకారులకు ఎంతో కొంత ఆదరువుగా ఉండేది. ఎన్నికల కమిషన్‌కు నివేదించామని, అక్కడ నుండి అనుమతి రాగానే పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది జరుగుతున్న కార్యక్రమాన్ని ఇసికి నివేదించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం కాని స్థితి నెలకొంది. ఇసి నుండి అనుమతివచ్చిన తరువాత మార్గదర్శకాలు జారీ చేసి, సర్వేతో మిగిలిన ప్రక్రియ పూర్తిచేసి, చివరకు పరిహారం అందే సమయానికి నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాతే పరిహారం అందే అవకాశం ఉందని కొందరు ఉన్నతాధికారులు చెబుతుండటం గమనార్హం.

రాష్ట్రంలో ఎందరు?
రాష్ట్రంలో 8,74,837 మంది మత్స్యకారులు ఉన్నారు. 1.50 లక్షల మందికిపైగా సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. వారిలో 1,23,519 మందికి ప్రభుత్వం గత ఏడాది మత్స్యకార భరోసా అందించింది. కుటుంబానికి రూ.10 వేల రూపాయల చొప్పున రూ.123.52 కోట్లు మత్స్యకారుల ఖాతాలో జమచేసినట్లు ప్రభుత్వ రికార్డులు తెలియజేస్తున్నాయి. 2011లెక్కల ప్రకారం రాష్ట్రంలో 12,747 మోటారైజ్డ్‌ ,1771 మెకనైజ్డ్‌ బోట్లు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.

జిల్లాల వారీగా
శ్రీకాకుళం జిల్లాలో గతేడాది 15,281 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో సుమారు 800 మంది మత్స్యకారులకు నేటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఈ ఏడాది కూడా దాదాపుగా అంత సంఖ్యలోనే పరిహారం ఇయ్యవలసి ఉంటుందని భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో 1121 యాంతిక బోట్లు నిలిచిపోనున్నాయి. భోగాపురంలో ఐదు, పూసపాటిరేగ మండలంలో 11 గ్రామాల్లో వేటపై ఆధారపడిన కుటుంబాలు సుమారు 5వేలు ఉంటాయని అంచనా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 13 మండలాల్లో చేపల వేట ద్వారా 66 వేల కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయి. సుమారు 600 మెకనైజ్డ్‌ బోట్లు, 3 వేలకు పైగా మోటరైజ్డ్‌ బోట్లపై మత్స్యకారులు సముద్రంలో చేపల వేటను సాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మెకనైజ్డ్‌ బోట్లు117, మోటరైజ్డ్‌ బోట్లు 1500 ఉన్నాయి. మచిలీపట్నం, కఅత్తివెన్ను, నాగాయలంక, కోడూరు తదితర మండలాల్లో 14 వేల మంది వరకు సముద్రంపై వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. బాపట్ల జిల్లాలో గతేడాది జిల్లాలో 12,466 మంది మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించింది. అయితే మత్యకారుల్లో అర్హులైన పలువురికి ప్రభుత్వ సాయం అందలేదని ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 16వేల మంది మత్స్యకారులు, తిరుపతి జిల్లాలో 5వేల కుటుంబాలు సముద్రంలో వేటతో జీవనం సాగిస్తున్నారు.

గత ఏడాది ఇలా…
గత ఏడాది మత్స్యకార భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలు ఏప్రిల్‌ ఆరున విడుదలయ్యాయి. 17 నుంచి ఎన్యుమరేషన్‌ జరిగింది. అదే నెల 25న ఆర్‌బికెలు, సచివాలయాలో జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. అభ్యంతరాలను ఏప్రిల్‌ 25 నుంచి 27 స్వీకరించారు. వాటిని 28, 29 తేదీల్లో పరిష్కరించారు. 30న తుది జాబితాను ప్రకటించారు. మే 16 నుంచి మత్స్యకారుల ఖాతాలో డబ్బులు జమ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ ప్రక్రియే ప్రారంభం కాలేదు.

ఎన్నికల కమిషన్‌ నిర్ణయం మేరకు చర్యలు
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారి కె కరుణాకరరావు తెలిపారు. ఆ తర్వాతే ఎన్యుమరేషన్‌ ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు.

➡️