ధర లేదు.. దిగుబడీ లేదు ! : జీడి రైతు కుదేలు

May 6,2024 08:39 #Farmer, #price

ప్రజాశక్తి – సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఏజెన్సీలోని ఆదివాసీలకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా ఆదుకొనేది జీడి పంట అని చెప్పవచ్చు. సీతంపేట ఏజెన్సీలో గత రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యం వల్ల ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో పాటు జీడిపిందె దశలో వర్షాలకు తేనెమంచు, ఎండ తీవ్రత వల్ల జీడిపిందె రాలిపోయి, సగానికి సగం పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. దీంతో పాటు గత రెండేళ్లుగా జీడిపిక్కలకు మార్కెట్‌ ధర లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో సుమారు 25వేల హెక్టార్లలో జీడి పంట ఉంది. ఈ పంట కొన్నిచోట్ల పంట 30శాతం కూడా దిగుబడి రాలేదు. డిసెంబర్‌లో జీడి పంట పూత దశలో వస్తుంది. ఫిబ్రవరిలో పిందె సమయంలో రెండు వర్షాలు, వడగండ్ల వాన పడడంతో పంట పువ్వు రాలింది. దీంతో పాటు తేనె మంచుతోనూ, మబ్బులతో పిందె నిలిచి పోయింది. దీంతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పిందె రాలిపోయిం ది. దీంతో పంట దిగుబడి తగ్గిపోయిందని గిరిజన రైతులను ఆందోళన చెందుతు న్నారు. దీంతో పాటు మార్కెట్‌కు సంబంధించి నగదు రూ.50 వేలు మించి రవాణా చేయరాదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేయడంతో నగదు బదిలీ తక్కువ కావడంతో జీడిపిక్కల మార్కెట్‌ ధర పడిపోయింది. కిలో రూ.110, లేదా రూ.115 మాత్రమే వ్యాపారులు విక్రయిస్తున్నారు. గతేడాది కూడా వంద రూపాయలు మించకపోవ డంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు చెల్లింపుల్లేవన్న నెపంతో దళారులు సిండికేట్‌గా మారి జీడిపిక్కలను కారు చౌకగా కొనుగోలు చేసి లాభాలు అర్జిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీడికి మద్దతు ధర చెల్లించి విక్రయాలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
దిగుబడి రాలేదు
– నిమ్మక నారాయణరావు, కంబగూడ గిరిజనుడు.
ఈఏడాది జీడి పంట ఆశించిన స్థాయిలో దిగు బడి రాలేదు. ఐదు ఎకరాలకు గత ఏడాది ఆరు క్వింటాలు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మూడు క్వింటాలు రావడం కష్టం. అలాగే అప్పట్లో జీడి చెట్లు వేసి 42 ఏళ్లయింది. చెట్లు ముదిరి పోవడంతో కాపు తగ్గింది. దీంతో పాటు ప్రకృతి వైపరీత్యం వల్ల పంట తగ్గింది. మార్కెట్‌ ధర కూడా లేదు.
కిలో రూ.200 చొప్పున కొనుగోలు చేయాలి
– ఆరిక భాస్కర్‌ రావు, సిపిఎం మండల కార్యదర్శి, సీతంపేట.
గిరిజనులు శ్రమించు జీడి పిక్కలు సేకరిం చినా దళారులు సిండికేట్‌గా మారి మార్కెట్‌ ధర కల్పించక పోవడంతో నష్టాలు చవి చూడాల్సి వస్తు ంది. అధికా రులు స్పందించి రూ.200 చొప్పున కిలో జీడి పిక్కలుకొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

➡️