మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలపై .. పిడికిలెత్తిన కార్మిక, కర్షక లోకం

Nov 28,2023 10:30 #destructive policies, #Mahadharna
  • రెండు రోజుల్లో 29 అంశాలపై చర్చలు, తీర్మానాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  రైతులు, కార్మికులకు తీరని ద్రోహం చేస్తూ అన్యాయమైన విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు సమర శంఖారావం పూరించారు.

అటవీ హక్కులు కాలరాయడం సరికాదు : రైతు సంఘాల నాయకులు సింహాద్రి ఝాన్సీ, ఐఎఫ్‌టియు నాయకులు పి ప్రసాదు

ఖనిజాల దోపిడీ కోసం అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలను తరిమేయడం, తెగల మధ్య తగువులు పెట్టి హింసను ప్రేరేపించడం వంటి చర్యలకు దిగుతున్న మోడీని అధికారంలో నుండి సాగనంపాల్సిందే. మణిపూర్‌ ఘర్షణల వెనుక భూకబ్జా ప్రణాళిక ఉంది. స్త్రీలపై అనాగరిక దాడి వెనుక కార్పొరేట్‌ శక్తులు ఉన్నాయి.

విద్యావిధానం సరికాదు : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం సరికాదు. దీనిలో కేంద్రీకృతం, మతతత్వం, కాషాయీకరణ ప్రధానంగా ఉన్నాయి. వాటిని అంగీకరించడానికి వీల్లేదు. రాష్ట్రాల చేతుల్లో ఉన్న హక్కులనూ కాలరాస్తున్నారు.

ఉపాధి హామీని దెబ్బతీస్తున్నారుొ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దడాల సుబ్బారావు, ఆవుల శేఖర్‌

ఉపాధి హామీ పనులకు రోజుకు రూ.600 వేతనం, 200 రోజులకు పెంచాలని ఉన్నా కేంద్రం ఎత్తేయాలని చూస్తోంది. దేశంలో 15 కోట్ల మంది ఈ పథకం కింద రిజిస్టరయ్యారు. వారందరికీ అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి అసలు దీన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.

కూలీల డబ్బు వాడుకున్న ప్రభుత్వంొ అసంఘటిత రంగ నాయకులు ఆర్‌.వి.నరసింహారావు, వెంకటసుబ్బయ్య

దేశంలో 43.99 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అందులో నిర్మాణరంగం కీలకమైంది. వీరి కోసం 1996లో తీసుకొచ్చిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయి. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరుతో సంక్షేమ బోర్డులో ఉన్న కార్మికుల డబ్బులు 1,800 కోట్లు వాడేసుకుంది. లైసెన్సు ఉన్న ఆటో డ్రైవర్లందరికీ వాహనమిత్ర అమలు చేయాలి.

పట్టణాలు, గ్రామాల్లోనూ పన్నుల దోపిడీ : పౌర సంక్షేమ సంఘాల కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు

పనులు చేయకపోయినా వేర్వేరు పేర్లతో పట్టణాలు, గ్రామాల్లో ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా దోచుకుంటున్నాయి. సంస్కరణలని పేరుపెట్టి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. అన్ని వ్యవస్థలనూ, రంగాలనూ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర షరతులకు తలొగ్గి రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇష్టారీతిన పన్నులు వసూలు చేస్తున్నారు.

స్టీలు ప్లాంటు ప్రజల సొమ్ము : స్టీలు ప్లాంటు యూనియన్‌ నాయకులు ఆదినారాయణ

విశాఖ స్టీలు ప్లాంటు ప్రజల సొమ్ము. కార్మికుల కష్టార్జితంతో నిర్మించింది. దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా ఇప్పుడు దాన్ని అమ్మాలనుకుంటున్నారు.

మహిళల శ్రమ దోపిడీ : స్కీమ్‌వర్కర్స్‌ నాయకులు బేబీరాణి, దయామణి

రాష్ట్రంలో జీతాలు పెంచకుండా జగన్‌ ప్రభుత్వం స్కీము వర్కర్ల శ్రమను దోపిడీ చేస్తోంది. ఇసుకను నిలిపేసి అసంఘటితరంగ కార్మికుల పొట్ట కొడుతున్నారు. పెద్దయెత్తున అవినీతి జరుగుతోంది. మద్యంలో రూ.24 వేలకోట్ల లాభం వస్తే ఎక్కడికి పోయిందో తెలియదు.

మోడీ పాలనలో తీవ్ర అవినీతి, అక్రమాలు : కార్మిక నాయకులు మోహన్‌, సుధీర్‌, రాజు

మోడీ పాలనలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగాయి. అదానీ కుమారుని ఆదాయం విపరీతంగా పెరిగింది. మోడీ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. వలస కార్మికులపై వార్తలు రాసిన మీడియా సంస్థలపై దాడులు చేస్తున్నారు.

ప్రాజెక్టుల ఊసేలేదు : రైతు నాయకులు గాలి చంద్ర, పువ్వాడ సుధాకర్‌

రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పనకు తోడ్పడే ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టి లేదు. ఎన్నికల అవసరంగా వాటిని వాడుకుంటున్నారు. రాజధానిని కావాలని ఇబ్బంది పెడుతున్నారు.

కిక్కిరిసిన జింఖానా గ్రౌండ్‌

దేశ వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో రెండురోజులపాటు నిర్వహించనున్న మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుండి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, సంఘాల నాయకులు, పెద్దయెత్తున తరలివచ్చారు. జింఖానా గ్రౌండ్‌ కిక్కిరిసింది. నిర్వాహకులు అప్పటికప్పుడు అదనంగా టెంట్లు తెప్పించి వేయాల్సి వచ్చింది. ఉదయం పదిగంటల నుండి 12 గంటల వరకూ ఒక సెషన్‌, మధ్యాహ్నం మూడుగంటల నుండి నాలుగున్నర వరకూ, ఐదుగంటల నుండి ఏడుగంటల వరకూ మరోసెషన్‌ నిర్వహించారు. రెండురోజులపాటు రైతులు, కార్మికులు అక్కడే ఉండనున్నారు. 29 తీర్మానాలను వేర్వేరు రంగాల నాయకులు ప్రవేశపెట్టనున్నారు. రాత్రి 8:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విశాఖ స్టీలు ప్లాంటు, ఢిల్లీలో రైతులు నిర్వహించిన ఆందోళనలపై చిత్రీకరించిన రెండు షార్ట్‌ ఫిల్మ్‌లను ప్రదర్శించారు.

➡️