అటకెక్కిన ఆధునీకరణ..!

  • ఉమ్మడి గోదావరి జిల్లాల డెల్టాల ఆధునికీకరణ పనులకు తిలోదకాలు
  • ప్రణాళికలు సిద్ధం చేసినా అనుమతివ్వని ప్రభుత్వం
  • మెరకదేరి ప్రతియేటా పంట నష్టం

ప్రజాశక్తి – ఏలూరు, రాజమహేంద్రవరం ప్రతినిధులు : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా ఆధునీకరణ, కాలువ పనులను ప్రభుత్వం అటకెక్కించింది. తూడు, గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు కాల్వలు, లాకుల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. దీంతో ప్రతిఏటా మెరకదేరి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఆధునీకరణ, కాలువలకు సంబంధించి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా అనుమతులు రావడం లేదు. మరోవైపు గతంలో చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో కాంట్ట్రాకర్లు ముందుకు రావడం లేదు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5.29 లక్షల ఎకరాల్లో డెల్టా ఆయకట్టు ఉంది. గోదావరి నుంచి 11 ప్రధాన కాలువలు, 300కు పైగా ఉప కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. 2007లో అప్పటి ప్రభుత్వం డెల్టా ఆధునీకరణ పనులకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు రూ.1,464 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.800 కోట్ల మేర పనులు చేశారు. అయితే పనులు చేసి దశాబ్ధన్నర కాలం గడిచిపోవడంతో కాలువల్లో గుర్రపుడెక్క, తూడు, కర్రనాచు పేరుకుపోయింది. వైసిపి ప్రభుత్వంలో డెల్టా ఆధునికీకరణ కోసం ప్రతి ఏడాది ప్రతిపాదనలు పంపినా అధికారుల నుంచి అనుమతులు రావడం లేదు. ఈ ఏడాది కూడా రూ.350 కోట్ల పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాలేదు. ఆధునీకరణ పనులపై జిల్లా ఇరిగేషన్‌ అధికారి రవిబాబును వివరణ కోరగా ఈ ఏడాది డెల్టా ఆధునీకరణ పనులేవీ జరగడం లేదని సమాధానమిచ్చారు.

చివరి ఆయకట్టుకు అందని నీరు
కాలువలు మెరకదేరిపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. వర్షకాలంలో కాలువలు పొంగిపొర్లడంతో అన్నదాతలు పంటలు నష్టపోతున్నారు. 2022-23లో అమలాపురం రూరల్‌, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో రైతులు క్రాఫ్‌ హాలిడేను ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో క్లోజర్‌ పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రావడం రాలేదు.

ప్రతి ఏడాది ముంపే
ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి తూర్పు డెల్టాలో 268.6 కిలోమీటర్లు, మధ్య డెల్టాలో 226.83 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలు ఉన్నాయి. క్లోజర్‌ పనులకు సంబంధించి తూర్పు, మధ్య డెల్టాకు దాదాపు రూ.30 కోట్లు అవసరమని, వెంటనే పనులకు అనుమతి ఇవ్వాలని జనవరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు కోరినా అనుమతులు రాలేదు. గత ఏడాది ఖరీఫ్‌లో తుపాను నేపథ్యంలో డ్రెయిన్ల పూడికతీత జరగకపోవడంతో కోనసీమ జిల్లాలోని తాళ్లరేవు, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అమలాపురం రూరల్‌ మండలాల్లో సుమారు 40వేల ఎకరాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి.

అనుమతులు రాగానే పనులు : – జి. శ్రీనివాసరావు, ఎస్‌ఇ, నీటిపారుదల శాఖ తూ.గో జిల్లా
ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే గోదావరి డెల్టాలో కాల్వల నిర్వహణ పనులు చేపడతాం. రూ.30 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

➡️