‘కళ్లెట్టుకు సూడండ్రా బాబూ…’

Apr 30,2024 05:36

”ఒరే సూరిబాబూ ! ఇయ్యాల ఎవురి మీటింగ్‌ కాడ ఏసేర్రా మన డూటీ?”
” ఈ మద్దేనం మనం సైకిల్‌ మీటింగ్‌ కి పోవాలని సెప్పేడ్రా మేస్త్రీ ” అని అప్పన్నకి బదులిచ్చేడు సూరిబాబు. ”మరి ఆ పేనోళ్ళు (ఫ్యాన్‌ పార్టీ వాళ్ళు) ఎక్కువ కూలీ ఇస్తన్నారట నిజవే ని నా ?” అని భోగట్టా చేసేడు అప్పన్న. ”అయ్యన్నీ మనకు తెల్దు. అయినా మన మేస్త్రీ అయ్యన్నీ సూసుకుంటున్నాడు కదా, ఆడు సెప్పినకాడికి ఎల్లిపోడవే నిమన డూటీ” అంటూ స్పందించేడు సూరిబాబు.
ఈ లోపు అటేపు ఆ ఊరి రిటైర్డ్‌ టీచర్‌ సత్యం గారు వచ్చేరు. ”ఏవుర్రా! ఏంటి సంగతులు?” అని పలకరించేరు. ”మరేట్నేదు బాబూ, ఇయ్యాల మా డూటీ ఎక్కడేసేరా అని మాట్టాడుకుంటన్నాం” అని చెప్పేడు అప్పన్న. ”అయినా, ఓరోజు సైకిల్‌ జెండా, ఇంకోరోజు ఫ్యాన్‌ జెండా పుచ్చుకుని ఊరేగుతున్నారే మీరంతా! ఇదేమైనా బాగుందా? ఏదో ఒక పార్టీకి కట్టుబడాలి కదా?” అనడిగేరు సత్యం మాస్టారు. ”అదేటి బాబూ అలాగంతారు? ఆ పోటీలో ఉన్నోల్లకే ఎవులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు జంపైపోతారో తెల్డం నేదు. మాకేటి బాబూ, రోజు కూలీ, పైగా బిరియానీ, ఓ కోర్టరు మందు ఇచ్చేవోడు ఎవుడు పిలిత్తే ఆడెనకే ఆ రోజుకి ఎల్తాం. ఆరోజుకి ఆడికే జై కొడతాం. ఇందులో తప్పేటుంది?” అని సూరిబాబు సమాధానం ఇచ్చేడు. ”మరి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తార్రా మీరు?” అని సత్యంగారు అడిగేరు.
”అది తెలీకే గద దేశం దేశమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటన్నారు? మాువు ఇప్పుడా సంగతి ఆలోసించం. అప్పుడే తేల్చుకుంటాం.” అన్నాడు అప్పన్న. ”అది సరే కాని, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళకే ఓటేస్తారట కదా మీరు?” మళ్ళీ అడిగేరు సత్యంగారు. ”డబ్బులిస్తే ఎందుకు పుచ్చుకోం బాబూ? ఎవులిచ్చినా తీసుకుంటాం. ఆ టయంకి ఎవులికి ఓటెయ్యాలో అప్పుడాలోసిత్తాం.” అని సూరిబాబు అనడంతో ఆ ఓటర్ల మనోభావాలేమిటో అర్ధం కాక సత్యంగారు ఆలోచనలో పడ్డారు.
్య్య్య
ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దాంతో అప్పన్న, సూరిబాబు అండ్‌ కో చాలా బిజీ అయిపోయేరు. ఒక్కోరోజున ఉదయం సైకిల్‌ జెండా, మధ్యాహ్నం ఫ్యాన్‌ జెండా పట్టుకోవలసివస్తోంది. డబుల్‌ డ్యూటీలతో డబుల్‌ సీసాలతో అలసి సొలసిపోతున్నారు ఈ బ్యాచ్‌ అంతా.
ఎన్నికలకి 48 గంటలకి ముందు ప్రచారం ఆగిపోయింది. సూరిబాబు అండ్‌ ఓ కి పనులు లేవు. ఐనా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఎప్పుడు ఏ క్యాండిడేట్‌ మనుషుల్ని మేస్త్రీ తమ పేటకి తెస్తాడో, ఎవరు ఎంతెంత పంచుతారో తెలియాలికదా, పంచింది తీసుకోవాలి కదా. అందుకన్నమాట.
అలా రెండు వైపులా వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆ పేటలో ఓ చర్చ మొదలైంది.
”ఒరే సూరిగా ! మల్లీ పేనోడొస్తే అంతా నాసెనవేని అనంతాడేంట్రా ఆ సైకిలోడు ?” అడిగేడు అప్పన్న. ”మరి ఆ పేనోడేట్రా అలాగంతాడు? సైకిలోడొస్తే పెనసన్లన్నీ ఆగిపోతాయంతాడు? వొలంటీర్లనందరినీ పీకేత్తారంటాడు?” అని ఎదురడిగేడు సూరిబాబు. ఇద్దరి మీటింగులకీ వెళ్తున్నందువలన, అటు సైకిలు, ఇటు ఫ్యాను ఒకరినొకరు తిట్టుకుంటున్నవన్నీ వీళ్ళకి బాగా బోధపడ్డాయి.
వొయిజాగు స్టీలు ప్లాంటును అమ్మేత్తూంటే పేనోడేం సేసేడు?
మరి ఆ వొయిజాగు స్టీలు ప్లాంటును అమ్మేసే కమలం తో సైకిలోడు ఎందుకు జెత కట్టినట్టు?
మనకి సెత్త పన్ను, కరెంటు బిల్లు అన్నీ పెంచీసినోడు పేనోడే కదా ?
అలా పెంచి వొడ్డించమని సెప్పింది కమలం పార్టీ. దాంతో ఈ సైకిలోడు ఎందుకు కలిసినట్టు?
పేనోడే మల్లీ వొత్తే జెనాల నోల్లు నొక్కేత్తాడు.
సైకిలోడు అసలు ఎవులికీ నోరెత్తే శాన్సే ఇవ్వడు కదా
”నయవంచన, నక్కజిత్తుల ముసలోడు”
”రాక్షస పాలన, సర్వ నాశనం”
ఇలా చర్చ చాలాసేపు జరిగింది. ఆ లోగా అక్కడికి వాళ్ళ మేస్త్రీ వచ్చేడు. అందరినీ ఐక్యపరచగలడు గనకే అతగాడు మేస్త్రీగా కొనసాగుతున్నాడు. అతగాడితో తమ చర్చల సారాంశాన్ని చెప్పుకున్నారు ఆ కూలీలంతా.
సైకిలోళ్ళు ఎంత దొంగలో ఫ్యాన్‌ పార్టీవాళ్ళు చెప్పేరు. అదంతా నిజమే కదా.
అలాగే ఫ్యాన్‌ పార్టీవాళ్ళు ఎంత దొంగలో సైకిల్‌ పార్టీవాళ్ళు చెప్పేరు. అదంతా కూడా నిజమే కదా. మరంచాత తెలిసి తెలిసీ ఆ దొంగల్లో ఎవరో ఒకరినెలా ఎన్నుకోడం?- ఇదీ ఆ సారాంశం.
దాంతోబాటు ఇంకో చిక్కు కూడా ఉంది. ఈ ఇద్దర్లో గెలిచేదెవడు? ఎవడు గెలుస్తాడో వాడికి కదా మన ఓటెయ్యాలి? లేకపోతే మన వోటు మురిగిపోయినట్టే కదా?
అప్పుడా మేస్త్రీ ఇలా చెప్పేడు. ”ఒరే అబ్బాయిలూ! ముందు మీరు చిక్కు అనుకుంటున్నది చిక్కు కానేకాదు. మనం ఎవులికి ఓటేత్తే ఆడే గెలుత్తాడు తప్ప ఎవుడు గెలుత్తాడో ఆడికి ఓటెయ్యాలనుకోవడం తెలివితక్కువతనం. మనల్ని బోల్తా కొట్టించడానికి మాత్రమే ఈ తప్పుడు వాదన పనికొస్తుంది. ఓట్లేసేది మనం. గెలిపించేది మనం. అది మనిష్టం ”
అక్కడున్నవాళ్ళు వెంటనే అడిగేరు. ”ఈ ఇద్దరూ దొంగలైనప్పుడు మనం మరి ఎవరికి ఓటెయ్యాలి? ”
ఆ సరికి మేస్త్రీ లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడయేడు. ఒక్క క్షణం ఆగి ” ఒరే! మీకేటి సొంత బుర్రలు లేనట్టు అడుగుతారేట్రా? ఈ ఇద్దరూ కాపోతే మరి మూడోవోడెవడూ లేనట్టడుగుతున్నారు? ”
”ఆ మూడోవోడెక్కడా ఆపడ్డం లేదు కదా?” అని వాళ్ళంతా అడిగేరు.
”జెనం కోసం పేనాలిచ్చేవోడెవడూ వొచ్చి మన కల్లముందు నాటకాలాడిడా. మనకోసం పోరాడుతూనే వుంటాడు. కష్టపడుతూనే వుంటాడు. ఆడు కనపడకపోడం కాదు. ఆడిని మనవే ని సరిగా సూడం. మన గోలలో మనం ఉంటాం. కాని ఆడికి జనం గోసే తప్ప వేరే బతుకు ఉండదు. ఆడిని మనవే ని రెండు కల్లెట్టుకు సూడాల. ఆడిని కాపాడుకోవాల. ఆడు మనోడ్రా. కల్లెట్టుకు సరిగ్గా సూడండి. ” అని చకచకా వెళ్ళిపోయేడు.
కళ్ళెట్టుకు చూసిన జెనాలకి ఎర్రజెండాల రెపరెపలే కనిపించాయి.

– సుబ్రమణ్యం

➡️