అమలు కాని ‘బ్రాండిక్స్‌’ హామీలు

  • నామమాత్రంగా పెట్టుబడులు
  • లక్ష్యంలో 34 శాతం మందికే ఉపాధి

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ (బిఐఎసి) ఏర్పాటుతో పెట్టుబడులు వరదలా వస్తాయని అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ప్రచారం సాగింది. దాదాపు కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామన్న, వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామన్న ఈ కంపెనీకి అత్యంత ఉదారంగా ఏడాదికి ఎకరాకు రూపాయికు చొప్పున వెయ్యి ఎకరాలను ప్రభుత్వం లీజుకిచ్చింది. 2005లో ప్రభుత్వంతో చేసుకున్న ఎంఒయు ప్రకారం 60 వేల ఉద్యోగాల హామీతో అడుగుపెట్టిన ఈ కంపెనీ నేటికీ రూ.1500 కోట్ల పెట్టుబడులకే పరిమితమైంది. 20,639 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించింది. వీరిలో 90 శాతం మంది మహిళలే ఉన్నారు. అతి తక్కువ వేతనంతో వీరితో పని చేయించుకుంటోంది. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఇజెడ్‌)లో అడుగుపెట్టిన ఈ కంపెనీ ఇచ్చిన హామీలను 19 సంవత్సరాలు కావస్తున్నా నిలబెట్టుకోలేదు. ఎస్‌ఇజెడ్‌ పేరుతో అనుమతులు తీసుకొని సర్వీస్‌ ట్యాక్స్‌, ఇన్‌కం ట్యాక్స్‌, విద్యుత్‌, నీటి ఛార్జీలు వంటి పలు రాయితీలు పొందింది. ఒప్పందం ప్రకారం పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పించకపోతే తిరిగి ప్రభుత్వానికి భూమి అప్పగిస్తామని చెప్పింది. కానీ, ఇప్పటికి నెలకొల్పిన 17 యూనిట్లలో ఒకటి మూతపడగా 16 యూనిట్లు నడుస్తున్నాయి. వీటిలో బ్రాండిక్స్‌కు సంబంధించి రూ.305.5 కోట్ల పెట్టుబడితో లోదుస్తులు తయారు చేసే మూడు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో 12 వేల మంది పని చేస్తున్నారు. మిగిలినవి ఇతరులకు చెందిన కంపెనీలు. నీటి శుద్ధి, ఎఫ్లూయింట్‌ ట్రీట్‌మెంట్‌ ఇతర మౌలిక సదుపాయాల కల్పన పేరుతో భారీగా బ్రాండిక్స్‌ యాజమాన్యం ఆ కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేస్తోంది. ఎస్‌ఇజెడ్‌లోని కంపెనీ నుంచి విడుదలైన వ్యర్థ రసాయనాలను సరిగా శుద్ధి చేయకుండా సముద్రంలో విడిచిపెట్టడంతో సముద్రంలో చేపల ఉత్పత్తి తగ్గి, మత్స్యకారుల పొట్టకొట్టిందన్న విమర్శలు బ్రాండిక్స్‌ ఎదుర్కొంటుంది.

➡️