కేంద్రప్రభుత్వం సహకరించేనా?

  • నత్తనడకన కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను పనులు
  • అరకొర నిధులతోనే సరిపెడుతున్న వైనం
  • రాష్ట్రంలోని నూతన సర్కారుపై కోనసీమ వాసుల ఆశలు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను పనులు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 22 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అరకొర నిధులు విడుదల చేస్తూ చేతులు దులిపేసుకుంటోంది. కొనసీమవాసుల చిరకాల వాంఛను నీరుగారిస్తోంది. ఇప్పటి వరకు 48 శాతం నిధులు మాత్రమే విడుదల చేయడంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 2001లో కోటిపల్లి-నర్సాపురం మధ్య 57.21 కిలోమీటర్ల మేర రైల్వే లైను మంజూరైంది. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతాబెనర్జీ 2002లో అమలాపురంలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు చోట్ల వంతెనలు, తొమ్మిది చోట్ల రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మొదట్లో రూ.300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్మాణంలో తీవ్ర జాప్యం వల్ల అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,300 కోట్లకు పెంచారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడల్లా నిధులు కేటాయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు సుమారు రూ.1,100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వాటాగా రూ.575 కోట్ల వరకూ కేటాయించాల్సి ఉంది. 2014లో టిడిపి ప్రభుత్వం రూ.3 కోట్లు, 2019లో వైసిపి ప్రభుత్వం సుమారు రూ.50 కోట్లు ఇచ్చింది.

భూ సేకరణలో తీవ్ర జాప్యం
ఈ ప్రాజెక్టులో భాగంగా భూ సేకరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతులకు పరిహారం ఇవ్వడంలో అలసత్వం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. కోటిపల్లిాముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై 3.50 కిలోమీటర్ల మేర వంతెన పనులకు 44 పిల్లర్ల నిర్మాణం మూడేళ్ల క్రితం పూర్తయింది. ఈ వంతెనపై గడ్డర్లు వేయడానికి అధికారులు టెండర్లు పిలిచారు. దిండిాచించినాడ మధ్య 1.2 కిలోమీటర్ల పొడవున 21 పిల్లర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. సకాలంలో నిధులు విడుదల కానందున ఇప్పటివరకు 19 మాత్రమే పూర్తయ్యాయి. బోడసకుర్రుాపాశర్లపూడి బాడవ వరకు 1.50 కిలోమీటర్ల వంతెన నిర్మాణంలో భాగంగా 22 పిల్లర్లలో 19 పిల్లర్లు పూర్తయ్యాయి. వీటిపై గడ్డర్ల ఏర్పాటుకు టెండర్లు పిలవాల్సి ఉంది. కోటిపల్లి-భట్నవిల్లి మధ్య, నరసాపురం-చించినాడ మధ్య సుమారు 950 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. 250 ఎకరాలు భూ సేకరణ బాలయోగి స్పీకర్‌గా పనిచేసిన సమయంలోనే పూర్తయింది. ఇంకా 750 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తమ చిరకాల స్వప్నం పూర్తయ్యేలా త్వరితగతిన భూ సేకరణ పనులు చేపట్టి రైల్వే లైన్‌ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోనసీమవాసులు కోరుతున్నారు.

ఇది పూర్తయితే…
ఈ లైన్‌ పూర్తయితే ప్రధాన లైనుపై ఒత్తిడి తగ్గుతుంది. విశాఖపట్నం, సామర్లకోట తర్వాత కాకినాడ నుంచి కోటిపల్లి, నర్సాపూర్‌ మీదుగా మచిలీపట్నం, రేపల్లె తర్వాత చెన్నై ప్రధాన లైన్‌లో ఇది కలుస్తుంది. తద్వారా చెన్నై వెళ్లే రైళ్లు రాజమహేంద్రవరం, విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పోర్టుల అనుసంధానంతోపాటు పారిశ్రామిక కారిడార్‌లో సరకు రవాణాకూ దోహదం చేయనుంది.

➡️