క్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌

  • రెండోరౌండ్‌లో ఓడిన సింధు
  • ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

లండన్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీల్లో పివి సింధు మహిళల సింగిల్స్‌లో పరాజయాన్ని చవిచూడగా.. యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో లక్ష్యసేన్‌ 4వ సీడ్‌, డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్‌పై మూడుసెట్ల హోరాహోరీ పోరులో నెగ్గాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 24-22, 11-21, 21-14తో ఆంటోనెన్స్‌ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ సుమారు 80నిమిషాలసేపు సాగింది. క్వార్టర్స్‌లో 18వ సీడ్‌ లక్ష్యసేన్‌ 10వ ర్యాంకర్‌ లీ-జి-జియా(మలేషియా)తో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు పోరాటం రెండోరౌండ్‌లోనే ముగిసింది. రెండోరౌండ్‌ పోటీలో సింధు 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో చైనాకు చెందిన ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ అన్‌సే యంగ్‌ చేతిలో ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్‌ కేవలం 42 నిమిషాల్లోనే ముగిసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. రెండో సెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. ఇక మహిళల డబుల్స్‌లో తానీషా-అశ్విని పొన్నప్ప రెండోరౌండ్‌కే పరిమితమయ్యారు. వీరు చైనా షట్లర్లు జంగ్‌-జియాంగ్‌ చేతిలో 21-11, 11-21, 10-21తేడాతో ఓటమిపాలయ్యారు.

➡️