జైస్వాల్‌ ఒక్కడే..

Feb 2,2024 22:05 #Sports

– డబుల్‌ సెంచరీ దిశగా యువ బ్యాటర్‌ -భారత్‌ 326/6- ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌

విశాఖపట్నం: ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ భారీ శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండోటెస్ట్‌లో టీమిండియా గౌరవప్రద స్కోర్‌ దిశగా పయనిస్తోంది. జైస్వాల్‌(176నాటౌట్‌) ఒంటరి పోరాటం చేయడంతో భారత్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 336పరుగులు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(14) మరోసారి విఫలమయ్యాడు. 41బంతులు ఎదుర్కొని బషీర్‌ వేసిన 17వ ఓవర్‌ మూడో బంతికి ఓలీ పోప్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రోహిత్‌ స్థానంలో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌.. ధాటిగా ఆడేందుకు యత్నించాడు. 46 బంతుల్లో ఐదు బౌండరీల సాయంతో 34 పరుగులు చేసిన గిల్‌ను ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ బోల్తా కొట్టించాడు. లంచ్‌లోపు భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అర్థ సెంచరీ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో జతకలిసిన జైస్వాల్‌.. మూడో వికెట్‌కు అతడితో కలిసి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. తొలి టెస్టులో విఫలమైన అయ్యర్‌.. రెండో టెస్టులో కూడా అదే బాటపట్టాడు. అయ్యర్‌ను టామ్‌ హర్ట్‌లీ ఔట్‌ చేశాడు. టీ విరామానికి ముందు జైస్వాల్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆరంభంలో నిలకడగా ఆడిన యశస్వి ఆ తర్వాత జోరు పెంచి 151బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 94 పరుగుల వద్ద ఉండగా సిక్సర్‌తో శతకాన్ని కొట్టాడు. టెస్టులలో జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ కాగా స్వదేశంలో తొలి శతకం. అయ్యర్‌ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. అయితే మ్యాచ్‌ మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా అక్షర్‌.. బషీర్‌ వేసిన ఓవర్లో రిహాన్‌ అహ్మద్‌ చేతికి చిక్కాడు. లోకల్‌ బారు శ్రీకర్‌ భరత్‌.. (17; 23బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్‌) కూడా ధాటిగా ఆడబోయి రిహాన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బషీర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అహ్మద్‌, బషీర్‌లకు రెండేసి ఆండర్సన్‌, హర్ట్‌లీకి ఒక వికెట్‌ దక్కాయి. తొలి డబుల్‌ సాధించేనా..?టెస్టులలో యశస్వీకి ఇదే అత్యుత్తమ స్కోరు. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జైస్వాల్‌.. కెరీర్‌లో 6వ టెస్ట్‌ ఆడుతున్న జైస్వాల్‌.. వైజాట్‌ టెస్టులో డబుల్‌ సెంచరీకి చేరువయ్యాడు. తొలి ఆట రెండో రోజు ముగిసేసరికి 179పరుగులతో డబుల్‌ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. టెస్టులలో తొలి ద్విశతకం చేయడానికి జైస్వాల్‌కు మరో 21 పరుగులు మాత్రమే కావాలి.

స్కోర్‌బోర్డు..

ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బ్యాటింగ్‌) 179, రోహిత్‌ శర్మ (సి)పోప్‌ (బి)షోయబ్‌ 14, శుభ్‌మన్‌ (సి)ఫోక్స్‌ (బి)ఆండర్సన్‌ 34, శ్రేయస్‌ (సి)ఫోక్స్‌ (బి)హార్ట్‌లీ 27, రజత్‌ పటీధర్‌ (బి)రేహన్‌ అహ్మద్‌ 32, అక్షర్‌ పటేల్‌ (సి)రేహన్‌ అహ్మద్‌ (బి)షోయబ్‌ బషీర్‌ 27, శ్రీకర్‌ భరత్‌ (సి)షోయబ్‌ బషీర్‌ (బి)రేహన్‌ అహ్మద్‌ 17, అశ్విన్‌ (బ్యాటింగ్‌) 5, అదనం 1. (93ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 336పరుగులు.

వికెట్ల పతనం: 1/40, 2/89, 3/17, 4/249, 5/301, 6/330

బౌలింగ్‌: ఆండర్సన్‌ 17-3-30-1, రూట్‌ 14-0-71-0, హార్ట్‌లీ 18-2-74-1, షోయబ్‌ బషీర్‌ 28-0-100-2, రేహన్‌ అహ్మద్‌ 16-2-61-2.

➡️