యాక్సిడెంట్‌లో కెన్యా యువ మారథాన్‌ కెల్విన్‌ మృతి

నైరోబి: కెన్యా మారథాన్‌ స్టార్‌ అథ్లెట్‌, 24ఏళ్ల కెల్విన్‌ కిప్టుమ్‌ కారు ప్రమాదంలో కన్నుమూశాడు. కెన్యాలోని కప్తగట్‌ నుంచి ఎల్డోరెట్‌కు వెళ్తుండగా రాత్రి 11 గంటల సమయంలో అతని కారు అదుపుతప్పి చెట్టును ఢకొీట్టింది. ప్రమాదం సమయంలో కారులో కెల్విన్‌తోపాటు కోచ్‌ గెర్వైస్‌ హకిజిమానా కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో కెల్విన్‌తోపాటు అతని కోచ్‌ కూడా సంఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్ర గాయాలతో కారులో ఉన్న మరో మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కెల్విన్‌ కిప్టుమే కారు డ్రైవింగ్‌ చేసినట్లు సమాచారం. పోలీస్‌ కమాండర్‌ పీటర్‌ ములింగే మాట్లాడుతూ.. ”ప్రమాదం జరిగిన సమయంలో కారును కిప్టుమే డ్రైవింగ్‌ చేసినట్లు, అతి వేగం కారణంగానే వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని తెలిపారు. మారథాన్‌లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టి 5 నెలలు కూడా పూర్తి కాకముందే అతడు మరణించడంతో క్రీడా ప్రపంచ విషాదంలో ముగినిపోయింది. కాగా గతేడాది అక్టోబర్‌ 8న చికాగోలో జరిగిన మారథాన్‌ పోటీల్లో కెల్విన్‌ కిప్టుమ్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ పోటీల్లో 2 గంటల 35 సెకన్లలోనే తన పరుగును పూర్తి చేశాడు. దీంతో మారథాన్‌లో అత్యంత వేగంగా పరుగును పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2 గంటల ఒక నిమిషంలోపు మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో తాను పాల్గొన్న మూడో మారథాన్‌ పోటీలోనే అతను ఈ రికార్డును సాధించడం విశేషం. అంతేకాకుండా అప్పటికీ అతను వయసు 23 సంవత్సరాలు మాత్రమే. లండన్‌ మారథాన్‌లో కూడా కెల్విన్‌ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే రోటర్‌డ్యామ్‌ మారథాన్‌, పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకొంది. కెల్విన్‌ కిప్టుమ్‌ మృతిపై ప్రపంచ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో స్పందిస్తూ.. కెల్విన్‌ మరణం తీరని లోటు అని అన్నాడు.

➡️