స్నేహ మాయాజాలం

Jul 1,2024 00:06 #Sports

8 వికెట్ల చెలరేగిన ఆఫ్‌ స్పిన్నర్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 266/10
చెన్నై : భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల ఏకైక టెస్టులో టీమ్‌ ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ రానా (8/77) మ్యాజిక్‌ చేసింది. 8 వికెట్ల ప్రదర్శనతో సఫారీ బ్యాటర్లను మాయలో పడేసింది. మరో స్పిన్నర్‌ దీప్తి శర్మ (2/47) సైతం మెరవటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 84.3 ఓవర్లలో 266 పరుగులకే కుప్పకూలింది. సఫారీ తరఫున మారజానె కాప్‌ (74, 141 బంతుల్లో 8 ఫోర్లు), సునె లుస్‌ (65, 164 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో రాణించారు. 337 పరుగుల వెనుకంజలో నిలిచిన దక్షిణాఫ్రికాను భారత్‌ ఫాలోఆన్‌కు పిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు ప్రతిఘటిస్తున్నారు. ఓపెనర్‌ లారా (93 నాటౌట్‌, 252 బంతుల్లో 12 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో, సునె లుస్‌ (109, 203 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కారు. 85 ఓవర్లలో 2 వికెట్లకు దక్షిణాఫ్రికా 232 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మరో 105 పరుగుల వెనుకంజలో నిలిచింది. నేడు చివరి రోజు ఆటలో భారత స్పిన్నర్లు మెరిస్తే.. మరోసారి బ్యాట్‌ పట్టకుండానే భారత్‌ విజయం సాధించేందుకు అవకాశం ఉంది.

➡️