బ్రేకుల్లేని జాక్స్‌

Apr 29,2024 08:31

ఛేదనలో విల్‌ జాక్స్‌ అజేయ సెంచరీ
విరాట్‌ కోహ్లి అర్ధ శతక జోరు
గుజరాత్‌పై బెంగళూరు ఘన విజయం
గుజరాత్‌ 200/3, బెంగళూర్‌ 206/1
ఐపీఎల్‌ 17వ సీజన్లో సిక్సర్ల తుఫాన్‌ కొనసాగుతోంది. విల్‌ జాక్స్‌ (100 నాటౌట్‌) శతక విధ్వంసంతో ఆదివారం మొతెరా మైదానం మోత మోగింది. 201 పరుగుల ఛేదనలో జాక్స్‌ 41 బంతుల్లోనే సెంచరీ సాధించగా.. విరాట్‌ కోహ్లి (70 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కోహ్లి, జాక్స్‌ మెరుపులతో 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ సీజన్లో బెంగళూర్‌కు ఇది వరుసగా రెండో విజయం కావటం విశేషం.

అహ్మదాబాద్‌ : విల్‌ జాక్స్‌ (100 నాటౌట్‌, 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ శతక సునామీలో గుజరాత్‌ టైటాన్స్‌ కొట్టుకుపోయింది. వరుస ఓవర్లలో తుఫాన్‌ సృష్టించిన విల్‌ జాక్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్‌ కోహ్లి (70 నాటౌట్‌, 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సైతం రాణించటంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 206 పరుగులు చేసింది. 9 వికెట్ల తేడాతో మరో 24 బంతులు ఉండగానే ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు నమోదు చేసింది. సాయి సుదర్శన్‌ (84, 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుక్‌ ఖాన్‌ (58, 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు పది మ్యాచుల్లో ఇది ఆరో ఓటమి కాగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు పది మ్యాచుల్లో ఇది మూడో పరాజయం.
జాక్స్‌ తుఫాన్‌ : 201 పరుగుల ఛేదనలో 14 ఓవర్లలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 148/1తో నిలిచింది. విరాట్‌ కోహ్లి 69 పరుగుల వద్ద ఉండగా.. విల్‌ జాక్స్‌ 44 పరుగుల వ్యక్తిగత స్కోరుతో క్రీజులో నిలిచారు. ఈ దశలో అందరూ విరాట్‌ కోహ్లి సెంచరీ కోసమే ఎదురుచూశారు. కానీ విల్‌ జాక్స్‌ ఝూలు విదిల్చాడు. వరుస ఓవర్లలో మోహిత్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లను ఊచకోత కోశాడు. 4, 6, 6, 2, 6, 4తో మోహిత్‌ శర్మను జాక్స్‌ ఉతికారేశాడు. ఆ తర్వాత రషీద్‌ ఖాన్‌ను సైతం జాక్స్‌ దంచికొట్టాడు. 6, 6, 4, 6, 6తో విశ్వరూపం చూపించాడు. ఈ రెండు ఓవర్లలో 29 పరుగుల చొప్పున పిండుకున్న విల్‌ జాక్స్‌ 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విల్‌ జాక్స్‌ ఊచకోత ఇన్నింగ్స్‌తో మరో 24 బంతులు మిగిలి ఉండగానే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 201 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. విరాట్‌ కోహ్లి (70 నాటౌట్‌), డుప్లెసిస్‌ (24) తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించి శుభారంభం అందించగా.. ఆ తర్వాత కోహ్లితో కలిసి విల్‌ జాక్స్‌ బెంగళూర్‌ ఇన్నింగ్స్‌కు రాకెట్‌ స్పీడ్‌ జోడించాడు.
సాయి, షారుక్‌ రాణించగా.. : తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. వృద్దిమాన్‌ సాహా (5), శుభ్‌మన్‌ గిల్‌ (16) విఫలమయ్యారు. సాయి సుదర్శన్‌ (84), షారుక్‌ ఖాన్‌ (58) అర్థ సెంచరీలతో టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. మిడిల్‌ ఓవర్లలో టైటాన్స్‌ స్కోరు వేగం కాస్త నెమ్మదించటంతో ఆ జట్టు ఆశించిన స్కోరు సాధించలేదు. డెవిడ్‌ మిల్లర్‌ (26 నాటౌట్‌) డెత్‌ ఓవర్లలో తనదైన విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. చేతిలో 7 వికెట్లు ఉన్నప్పటికీ గుజరాత్‌ టైటాన్స్‌ 200 పరుగులతోనే సరిపెట్టుకుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

 

➡️