ప్లాేఆఫ్స్‌ బెర్త్‌లు రసవత్తరం

May 11,2024 23:10 #Sports

రేసులో ఎనిమిది జట్లు
ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 ప్లాేఆఫ్‌ బెర్త్‌లు రసవత్తరంగా మారాయి. ఈ సీజన్‌లో మొత్తం 10జట్లు టైటిల్‌ను చేజిక్కించుకొనేందుకు బరిలోకి దిగినా.. రెండుజట్ల ప్లాేఆఫ్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికి దాదాపు 12 లీగ్‌ మ్యాచ్‌లు ముగిసినా.. ఏ ఒక్క జట్టూ ప్లాేఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోలేదు. కోల్‌కతా, రాజస్తాన్‌ రాయల్స్‌ 11మ్యాచ్‌లు ముగిసేసరికి 16పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ముంబయి, పంజాబ్‌ 12మ్యాచ్‌లు ముగిసేసరికి 8పాయింట్లతో ప్లాేఆఫ్‌ రేసు నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి. బెంగళూరు, గుజరాత్‌ జట్లకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఆ జట్ల ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్లు వరుస విజయాలు సాధిస్తే అవికూడా కూడా ప్లాేఆఫ్‌ రేసులో నిలవడం ఖాయం. ఇక చెన్నై, ఢిల్లీ, లక్నో జట్ల ఖాతాలో 12పాయింట్లు ఉన్నా.. ఈ మూడు జట్లతో పోల్చిచూస్తే చెన్నై మెరుగైన రన్‌రేట్‌ కలిసి ఉండడం సానుకూలాంభం. దీంతో 8 జట్ల మధ్య సెమీస్‌(ప్లాేఆఫ్స్‌) పోటీ రసవత్తరంగా మారింది. ఐపిఎల్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
చివరి వరకూ తేలదా?
పాయింట్ల పట్టికలో కోల్‌కతా (16), రాజస్థాన్‌ (16) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్‌ (1.453) కేకేఆర్‌కే ఎక్కువ. శనివారం కోల్‌కతా జట్టు ముంబయితో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో కెకెఆర్‌ గెలిస్తే.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. రాజస్థాన్‌ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా నాకౌట్‌ దశకు వెళ్లిపోయినట్లే. పై రెండు జట్ల తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా చాలు ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం. గుజరాత్‌తో 16న, పంజాబ్‌తో 19న తలపడనుంది. టాప్‌-2లోకి రావాలంటే రెండు మ్యాచుల్లోనూ గెలిచి.. కేకేఆర్‌, రాజస్తాన్‌ తమ మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడంతో చెన్నై అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 12మ్యాచుల్లో 6 విజయాలు, 6 ఓటములను నమోదు చేసింది. ఢిల్లీ(12), లక్నో(12)తో పాయింట్ల పరంగా సమంగా ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో టాప్‌ా4లో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో (రాజస్థాన్‌, బెంగళూరు) గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒక్కటి ఓడినా.. హైదరాబాద్‌, ఢిల్లీ, లక్నో ఫలితాలపై చెన్నై ఆధారపడాల్సిందే.
ఇక ఢిల్లీ, లక్నో తమ తర్వాతి మ్యాచులో నెగ్గి… 14న ముఖాముఖి పోటీపడతాయి. అక్కడ గెలిస్తే ప్లాేఆఫ్స్‌ రేసులో ఉంటారు. ఓడితే ఆశలు ఆవిరైనట్లే. నెట్‌రన్‌రేట్‌ ప్రకారం లక్నో కంటే ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది. బెంగళూరుతో ఢిల్లీ మే 12న ఆడనుండగా.. ముంబయితో మే 17న లక్నో తలపడనుంది.
బెంగళూరు వరుసగా 6 మ్యాచుల్లో ఓడిన తర్వాత.. గత నాలుగింట్లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. చివరి రెండు మ్యాచుల్లో ఢిల్లీ (మే 12), చెన్నై (మే 18)తో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచినా… టాప్‌-4లో చోటు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడనుంది.
గుజరాత్‌ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. 12మ్యాచుల్లో ఐదింట విజయాలు సాధించి 10 పాయింట్లతో ఉంది. ఆ జట్టు తన చివరి మ్యాచుల్లో గెలిచినా.. ఐదు టీమ్‌ల ఫలితాలను దాటుకొని ముందుకు రావాల్సి ఉంది. అయితే గుజరాత్‌, బెంగళూరు తమ తర్వాతి మ్యాచుల్లో ఓడితే వాళ్ల ఆఖరి మ్యాచ్‌ ఫలితంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు తీసుకురాకపోవచ్చు.
– ప్రజాశక్తి స్పోర్ట్స్‌డెస్క్‌

➡️