Ranji Trophy: విజేత ముంబయి

Mar 14,2024 16:35 #Cricket, #Mumbai, #Ranji Trophy, #Sports, #win
  • రంజీట్రోఫీ టైటిల్‌ 42వ సారి కైవసం

ముంబయి: రంజీట్రోఫీ టైటిల్‌ను ముంబయి జట్టు రికార్డుస్థాయిలో 42వ సారి చేజిక్కించుకుంది. గురువారంతో ముగిసిన ఫైనల్లో ముంబయి 169పరుగుల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో 538పరుగుల భారీ ఛేదనలో భాగంగా విదర్భ జట్టు చివరిరోజు 368పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ ఐదు వికెట్ల నష్టానికి 248పరుగులతో ఐదోరోజు ఆటను కొనసాగించిన విదర్భను కెప్టెన్‌ అక్షరు వాడేకర్‌(102), హర్ష్‌ దూబే(65) అర్ధసెంచరీతో ఆదుకున్నా.. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత విదర్భ వరుసగా వికెట్లను కోల్పోయింది. ముంబయి బౌలర్లు తనుష్‌ కోటియన్‌కు నాలుగు, దేశ్‌పాండే, ముషీర్‌ ఖాన్‌కు రెండేసి, ములాని, కులకర్ణికి ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో టైటిల్‌ నెగ్గిన ముంబయి జట్టుకు ఎంసిఎ క్రికెట్‌ అసోసియేషన్‌ 5కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీని ఆటగాళ్లకు అదనంగా అందజేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ముషీర్‌ ఖాన్‌, సిరీస్‌ తనుష్‌ కోటియన్‌లకు దక్కాయి.


కులకర్ణి గుడ్‌బై…
భారత ఫాస్ట్‌ బౌలర్‌ ధవల్‌ కులకర్ణి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ముంబయి జట్టును 42వ సారి టైటిల్‌ విజేతగా నిలిపిన కులకర్ణి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించిన ధవల్‌ కులకర్ణి ఫైనల్లో విదర్భపై ఆరు వికెట్లు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కెరీర్‌ ఆఖరి వికెట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ను వెనక్కి పంపి క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపాడు. కులకర్ణి 2008లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసి రంజీట్రోఫీలో 15సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10వికెట్ల ప్రదర్శన చేశాడు. మొత్తంగా ఈ స్పీడ్‌స్టర్‌ 95మ్యాచుల్లో 281 వికెట్లు పడగొట్టాడు.


ముంబయి ఆటగాళ్లకు నజరానా..
అత్యధికసార్లు రంజీట్రోఫీ టైటిల్‌ను అందుకున్న ముంబయిజట్టు ఆటగాళ్లకు అసోసియేషన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ముంబయి 42వసారి ఛాంపియన్‌గా నిలవడంతో తమ జట్టు సభ్యులకు రంజీట్రోఫీ ప్రైజ్‌మనీతో పాటు డబుల్‌ నజరానాను ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైజ్‌మనీ వచ్చే దానితో పాటు అదనంగా రూ.5 కోట్లను సొంతం చేసుకోనుంది. ”ఎంసిఎ అధ్యక్షుడు అమోల్‌ ఖేర్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు రంజీట్రోఫీ విజేతగా నిలిచిన మా జట్టు సభ్యులకు ప్రైజ్‌మనీని డబుల్‌ ఇవ్వాలని భావించారు. ముంబయి జట్టుకు ఈ సీజన్‌ బాగా కలిసొచ్చింది. అన్ని టోర్నీల్లో కలిపి ఏడు టైటిళ్లు సాధించాం. బిసిసిఐ టోర్నీల్లోని అన్ని విభాగాల క్రికెట్‌లో మావాళ్లు రాణించారు” అని ఎంసిఎ కార్యదర్శి అజింక్య నాయక్‌ వెల్లడించారు.

➡️