2వ ర్యాంక్‌కు సూర్యకుమార్‌

Jun 26,2024 23:03 #Sports

టాప్‌లో ట్రివిస్‌ హెడ్‌
ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల
దుబారు: టి20 బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. టి20 ప్రపంచకప్‌లో భారత్‌పై అర్ధశతకంతో మెరిసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ తొలిసారి సూర్యకుమార్‌ యాదవ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో దాదాపు ఏడు నెలల నుంచి ఐసిసి టి20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను హెడ్‌ వెనక్కి నెట్టాడు. వీరిద్దరికి కేవలం 2 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉండటం గమనార్హం. ప్రస్తుతం ట్రావిస్‌ హెడ్‌ 844 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 842 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌(816), బాబర్‌ అజామ్‌(755), మహమ్మద్‌ రిజ్వాన్‌(746) టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. ఆసీస్‌పై 41బంతుల్లోనే 92పరుగులు కొట్టిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. రోహిత్‌(527) 13స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో నిలిచాడు.
అక్షర్‌ పటేల్‌కు 8వ స్థానం
ఐసిసి టి20 బౌలర్ల జాబితాలో భారత్‌ తరఫున అక్షర్‌ పటేల్‌ ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. ప్రస్తుతం అతడు 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. టి20 ప్రపంచకప్‌లో ఆడిన మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్‌ యాదవ్‌(641) ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. టి20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (621) 17వ స్థానంలో నిలిచాడు. ఇక స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఏకంగా 44 స్థానాలను మెరుగుపర్చుకొని 589రేటింగ్‌ పాయింట్లతో 24వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

➡️