అక్రమ కట్టడాలను అడ్డుకున్న విఆర్‌ఒ

ప్రజాశక్తి- రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజుపురం గ్రామ పంచాయతీలోని గంగరాజపురం సమీపంలోని ప్రధానరహదారి ప్రక్కన వంక పరంబోకు ప్రభుత్వభూమిలో గంగరాజపురం గ్రామానికి చెందిన కొందరు ఆక్రమిం చుకుని అక్రమ కట్టడాలు చేపట్టారు. ఆ గ్రామంలోని ప్రజలకు ఫిర్యాదు మేరకు విఆర్‌ఒ నిరంజన్‌ కట్టడాలు చేపట్టిన ప్రాంతానికి వెళ్ళి పరిశీలిం చారు. నిర్మాణదారులు తమకు 1995లోనే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని అందుకే కట్టడాలు చేపట్టామని వారు విఆర్‌ఒకు తెలిపారు. ఆధారాలతో తహశీల్దార్‌తో మాట్లాడాలని అంతవరకు పనులు నిలిపివేయాలని చెప్పడంతో కట్టడాలను ఆపేశారు. సర్వే నెంబరు 38-1లో 2.14 ఎకరాల భూమి ఉందని, యేడాదిన్నర క్రితం స్థానిక ప్రజల వినతి మేరకు అధికా రులు రీసర్వే చేయించినట్లు తెలిపారు. అందులో వంక పోరంబోకు భూమి 50 సెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని అన్నారు. మిగిలిన భూమిని రైతులకు పట్టాలు మంజూరు చేశారని రైతులు తెలిపారు. ఈ స్థలం కొంత మేర రోడ్లు భవనాల శాఖ పరిధిలోనికి, మరికొంత ఇరిగేషన్‌ శాఖ పరిధిలోకి వస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 1995లో పట్టాలు ఇచ్చి ఉంటే ఇంతకాలం ఏమి చేశారని పోరంబోకు స్థలం ప్రధాన రహదారికి పక్కనే ఉండడంతో విలువ కోట్లలో ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు.

➡️