అస్తవ్యస్తంగా రహదారులు

కోనాపురం రోడ్డులో పడిపోయిన బైకిస్టులు

ప్రజాశక్తి-అరకులోయ : అరకులోయ ప్రాంతంలోని రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారి సౌకర్య కల్పిస్తామని ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చెప్పిన మాటలు ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. మారుమూల ప్రాంతంలోని రహదారులు మరమ్మతుకు నోచుకోకపోవడం, కొత్త రహదారులు నిర్మించక పోవడంతో వాహన చోదకులు నిత్యం నరకయాతన పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రహదారులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని మరమతుకు గురై గోతులు ఏర్పడటంతో అనేకమంది వాహనదారులు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు.అరకులోయ నుంచి కటికి జలపాతానికి వెళ్లే రోడ్డు పూర్తిగా మరమ్మత్తు కావడంతో ఇటు స్థానికులు, అటు పర్యాటక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుంకరమెట్ట నుండి తారు రోడ్డు వేసిన అధికారుల కటికి జలపాతానికి కిలోమీటర్ల దూరంలో రోడ్డు వేయక పోవడంతో గోతులమయమై పర్యాటకులకు ప్రాణ సంకటంగా మారింది. పూర్తిస్థాయిలో ఈ రోడ్డును బాగు చేయాలని ఎన్నిమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించే నాధుడు కరువయ్యారని ఆ ప్రాంతం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే ఈ రోడ్డులో కారు ప్రమాదం చోటుచేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే కటికి జలపాతం రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.అదేవిధంగా అరకులోయ మండలం లోతేరు సమీపంలోని తోటవలస జంక్షన్‌ నుంచి కోనాపురంకు వెళ్లే రహదారి కూడా పూర్తిగా రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. కోట్ల రూపాయలతో వేసిన ఈ రోడ్డు వేసిన కొద్ది నెలలకే రాళ్లు తేలి పూర్వ స్థితికి చేరుకుంది. అరకులోయ, అనంతగిరి రెండు మండలాల ప్రజలకు ఉపయోగపడే ఈ రోడ్డును బాగు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులకు, ప్రజా ప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం స్పందించలేదని ఆ ప్రాంతం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️