ఎన్నికల సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి-పాడేరు:రానున్న ఎన్నికలకు కేటాయించిన ఎన్నికల సిబ్బందికి ప్రతి అంశంపైనా శిక్షణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయ సునీత మాస్టర్‌ ట్రెయినీలను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, అన్నీ తెలుసుననే భావం ఎవ్వరికీ ఉండకూడదని, ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌ గా తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌ నుండి వచ్చే సూచనలు, నిభందనలు, మార్పులు, చేర్పులు గమనిస్తూ వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. శిక్షణలు ఎప్పటికప్పుడు నవీకరణకు తోడ్పడతాయని తెలిపారు. సమాచారం చేరవేయడంలో అలసత్వం, జాప్యం ఉండరా దన్నారు. ఇవిఎంల వినియోగంలో చిన్న పొరపాటు కూడా జరగరాదని, ఉంటే వాటిని సరిదిద్దుకునే అంశాలను ఎన్నికల సిబ్బందికి అర్ధం అయ్యే రీతిలో తగు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి చిన్న విషయం అట్టడుగు క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు చేరే విధంగా శిక్షణ ఉండాలన్నారు. ఓటింగ్‌ పూర్తైన తరువాత నాలుగు రకాల సీల్స్‌ వేయాలని, ఓటింగ్‌ లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య మెషిన్‌పై చూపించిన నంబరు, పిఒ డైరీలో నంబర్‌, ఓటింగ్‌ స్లిప్పులు తదితర ఐదు రకాల నంబర్లు ఒకేలా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పాడేరు, అరకు అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు భావన వశిస్ట్‌, వి.అభిషేక్‌, డిఆర్‌ఓ బి.పద్మావతి, అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనీలు, పాల్గొన్నారు.

➡️