ఎపిఒ తీరుపై సభ్యుల అసంతృప్తి

Mar 15,2024 23:06
ఎపిఒ కడియం భాస్కరరావు తీరుపై

ఎపిఒను నిలదీస్తున్న ప్రజా ప్రతినిధులు

ప్రజాశక్తి- కవిటి

ఎపిఒ కడియం భాస్కరరావు తీరుపై మండలంలోని ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కడియాల పద్మ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపిటిసిలు పూడి నీలాచలం, సనపల కృష్ణారావు, సర్పంచ్‌ ప్రతినిధి రవి ప్రధాన్‌ తమతమ పరిధిలో ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరు, లోటుపాట్లపై ప్రశ్నించారు. దానిపై సరైన వివరణ ఇవ్వని ఎపిఒ సభ్యులు అడిగిన ప్రశ్నలకు పరిష్కారం తన చేతుల్లోనే కాదు మండల పరిషత్‌ సమావేశ తీర్మానం కూడా పనిచేయదనే రీతిలో సమాధానం ఇచ్చారు. దీనిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి మండల పరిషత్‌ తీర్మానానికి విలువలేదని ఎపిఒ చెప్పడం సరికాదని, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఎంపిడిఒ శ్రీనివాస రెడ్డి కల్పించుకుని సభ్యులు కోరిన విధంగా తీర్మానం చేస్తామని చెప్పడంతో సభ్యులు శాంతించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్క తెల్లకార్డుదారునికి జాబ్‌ కార్డు అందివ్వాలని, మండలంలో సక్రమంగా విధులు నిర్వహించని క్షేత్ర సహాయకులను తొలగించి కొత్తవారిని నియమించేలా తీర్మానం చేయాలని కోరారు. అలాగే ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌ మాట్లాడుతూ బిజి పుట్టుగా సచివాలయం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించడం జరిగిందని, దానికి సంబంధించిన సమస్య రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, విద్యా శాఖ మూడు కలిసి సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో కో- ఆప్షన్‌ మెంబర్‌ పాండవ చంద్రశేఖర్‌ ఎంపిడిఒ శ్రీనివాస రెడ్డి, తహశీల్దార్‌ లక్ష్మి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, వైస్‌ ఎంపిపి కర్రి గోపయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షుడు దేవరాజు సాహు, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ వై.నీలయ్య, మాజీ వైస్‌ చైర్మన్‌ రజనీ కుమార్‌ దొలై, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

 

➡️