కార్పొరేషన్‌లో అవినీతి’కంపు’

కార్పొరేషన్‌లో అవినీతి'కంపు'ఉన్నతాధికారుల 'చేతి'వాటంతిరుపతిలో శానిటేషన్‌ 'మాఫియా' అధికార పార్టీతో సమ్మె 'విచ్ఛిన్నకుల' లాలూచీ
  • ఉన్నతాధికారుల ‘చేతి’వాటం
  • తిరుపతిలో శానిటేషన్‌ ‘మాఫియా’ అధికార పార్టీతో సమ్మె ‘విచ్ఛిన్నకుల’ లాలూచీ

పజాశక్తి – తిరుపతి టౌన్‌ : తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి ‘కంపు’ కొడుతోంది. ఉన్నతాధికారులు చేతివాటానికి అలవాటు పడటంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆడింది ఆటగా, పాడిందిపాటగా మారింది. అవినీతి ఏ స్థాయికి చేరిందంటే ఓ మాఫియాగా అవతారమెత్తింది. పారిశుధ్య కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ, వారికి ఇవ్వాల్సిన జీతాల్లో కోతలు పెడుతూ తిరుపతి కార్పొరేషన్‌ శానిటేషన్‌ ‘మాఫియా’గా మారిపోయింది. మలమూత్రాలను, మురుగును, చెత్తను ఒట్టిచేతులతో ఎత్తిపోస్తూ జీవనం గడుపుతున్న మున్సిపల్‌కార్మికులు గత రెండు వారాలుగా సమ్మెలో ఉన్నారు. తమను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలన్నది వారి డిమాండ్‌. తిరుపతిలో అయితే శానిటేషన్‌ మాఫియా ముసుగులో వీరిని దోచుకోవడం తీవ్రస్థాయిలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్త నిబంధనలను పక్కన పెట్టి తిరుపతిలో మున్సిపల్‌ కార్మికులకు స్థలాలను ఇప్పిస్తామని నమ్మబలికి దాదాపు 50 లక్షలు పైగా ‘వసూల్‌రాజా’లు దండుకున్నారు. 27.44 చ.కి.మీ నగర విస్తీర్ణంలో నిత్యం 250 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. శానిటరీ విభాగపు మేస్త్రీలు 50 మంది, ఇన్‌స్పెక్టర్లు 22 మంది ఉన్నారు. శాశ్వత పారిశుధ్య కార్మికులు 170 మంది ఉండగా, ఒప్పంద కార్మికులు 882 మంది, చెత్త సేకరణ వాహన డ్రైవర్లు 150 మంది పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంటే, తిరుపతిలో మాత్రం విచ్ఛిన్నకర శక్తులు సమ్మెను నిర్వీర్యం చేయడం గమనార్హం. శానిటేషన్‌ మాఫియా కర్రపెత్తనం స్మార్ట్‌సిటీలో శానిటేషన్‌ మాఫియా చాలా స్మార్ట్‌గా ‘స్ట్రాంగ్‌’గా ఉంది. ఔరా.. చెత్త సేకరణలో ఇంతటి అవినీతి దాగుందా? అని నోరెళ్లబెట్టేలా అవినీతి దాగుందన్న విమర్శలున్నాయి. మున్సిపల్‌ కార్మికులను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ‘ప్రైవేట్‌’ పనులకు ఉపయోగించుకుంటూ దందా సాగిస్తున్నారు. పొరుగు సేవల పారిశుధ్య కార్మికుడు విధులకు హాజరు కాకపోతే మొత్తం వేతనం చెల్లించడానికి ఓ కమీషన్‌, అదే శాశ్వత ఉద్యోగికైతే మరో కమీషన్‌ ఇక్కడ అమలవుతుంది. కార్మికుల కోసం అన్ని డివిజన్లలోనూ రెండు హాజరు పట్టికలు ఉంటాయి. ఉన్నతాధికారులు తనిఖీ చేస్తే తప్ప అన్ని డివిజన్లలోనూ అందరికీ వందశాతం హాజరు వేయడమనే సంప్రదాయం తిరుపతి ప్రత్యేకం. ఈ హాజరుతోనే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రింగై ప్రతినెలా లక్షల్లో ఆర్జిస్తున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంటింటి చెత్త సేకరణను గాలికొదిలి వాణీజ్య సముదాయాలు, బహుళ అంతస్తులు, కల్యాణ మండపాలు వంటి బల్క్‌ చెత్త ఉత్పత్తిదారుల నుంచి ఎంత పిండుకోవచ్చో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అంత పిండేస్తారన్నమాట. రెండు హాజరు పట్టీలను నిర్వహిస్తూ, పూర్తిస్థాయిలో హాజరు వేస్తూ, కార్మికులను తమ ‘ప్రైవేట్‌’ పనులకు ఉపయోగించుకుంటూ పెద్దఎత్తున అవినీతి దందా నడుపుతున్నారని చర్చ నడుస్తోంది. కొంతమంది కార్పొరేషన్‌ పరిధిలోని విధి నిర్వహణలోనే ఉండరు. అయినా వారికి నెలనెలా జీతం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఉన్నతాధికారుల అనుయాయులకు ఇది షరా’మామూలే’. ఆరేళ్లుగా ఓ వ్యక్తి మేస్త్రి హోదాలో పనిచేస్తున్నారు. అతను ఏనాడూ విధులకు హాజరు కాకపోయినా నెలనెలా జీతం జమ అవుతోంది. మామూళ్లలో అధికారులకూ వాటాలు ఉండటంతో ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదని చర్చ నడుస్తోంది. ఇదే కోవలోనే విధులకు హాజరు కాకుండానే కొంతమంది జీతాలు పొందుతూ, పారిశుధ్య కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తూ వారిని బలి పశువులను చేస్తున్నారన్న విమర్శలున్నాయి. చెత్త సేకరణలో అధిక ఆదాయం ఉన్న వార్డులను కేటాయించేందుకూ ‘కమీషన్‌’ వర్తిస్తుంది. ఆర్థికంగా ఎదిగిన ‘శానిటరీ’ విభాగం అధికారులు కార్మికుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని బ్యాంకు పాసు పుస్తకాలు, ఎటిఎంలను వారి వద్ద పెట్టుకుని ‘వడ్డీ’ వ్యాపారం చేస్తూ ‘కోట్ల’కు పడగలెత్తుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదిఏమైనా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను సైతం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పర్మినెంట్‌ చేసి, పారదర్శకంగా వేతనాలను వారివారి ఖాతాల్లో జమచేస్తూ నగరాన్ని ‘సుందరనగరంగా’ తీర్చిదిద్దేందుకు పాలకులు ‘చెత్త’శుద్ధి చూపాల్సి ఉంది. ఎర్రజెండా ముసుగులో అధికార పార్టీకి తాకట్టు ‘అందరూ ఇన్‌స్పెక్టర్లకు, మేస్త్రీలకు నమస్కారం.. మన సమ్మె ప్రభావంతో తిరుపతి నగరం అంతా చెత్త కుప్పలతో నిండిపోయింది. దీనికితోడు వర్షం వల్ల చెత్తకుప్పలు కుళ్లి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే ప్రభావం ఉంది. ప్రభుత్వం మన పట్ల కనీస ధర్మం పాటించకపోయినా, మనం తిరుపతి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారుల విజ్ఞప్తి మేరకు రేపు స్వచ్ఛంద సేవ చేయాలని నిర్ణయించడమైనది. ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొంటూనే స్వచ్ఛందంగా సేవకు సన్నద్ధం కావాలని యూనియన్‌ విజ్ఞప్తి చేస్తోంది. ప్రతి లీడర్‌ మన జెండా, మన కోర్కెల బ్యానర్‌ ప్రదర్శిస్తూ పుర పారిశుధ్యంలో రేపు పాల్గొనాలని కోరుతున్నాం.. త్వరలోనే శుభవార్త వస్తుందని ఆశిస్తున్నాం. ఇట్లు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌, తిరుపతి’ అంటూ ఓ రాష్ట్ర స్థాయి నాయకుడు పై విధంగా మెసేజ్‌ పెట్టి స్వచ్ఛంద సేవను నిరవధిక సమ్మెలో ఉన్న కార్మికులతో చేయించడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో సిఐటియు ఆధ్వర్యంలో వీరోచితంగా మున్సిపల్‌ పార్మికులు ‘ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌’ (సిఐటియు) ఆధ్వర్యంలో పోరాడుతుంటే, తిరుపతిలో నిర్వీర్యం చేసేలా ఆ రాష్ట్ర కార్మిక నాయకుని చర్యలు ‘ఎర్రజెండా’కే తలవంపులు తెచ్చేలా ‘స్వచ్ఛంద సేవ’ను కార్మికులతో చేయించడం కార్మికులు డోలాయమానంలో పడేలా చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా కూడా ‘శానిటేషన్‌ మాఫియా’లో భాగమేనా? అన్న అనుమానం కలగక మానదు.

➡️