టర్మినేషన్‌ ఉత్తర్వులు చట్టబద్ధంగా చెల్లవు : అఖిలపక్షం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అంగన్వాడీల టర్మినేషన్‌ ఉత్తర్వులు చట్టబద్ధంగా చెల్లవని, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్‌ చర్యలు లాగే ప్రభుత్వ సిఎస్‌ పై హైకోర్టు చర్యలు తప్పవని, సివిల్‌ సర్వెంట్లు ప్రభుత్వాల మెహర్బానీ కోసం తప్పులు చేస్తున్నారని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,6,000 మంది అంగన్వాడీలు 42 రోజులుగా కనీస వేతనాలు, ఇతర బెన్‌ఫిట్స్‌ కోసం సమ్మె చేస్తుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఉమ్మడి పరిధిలో ఉన్న ఐసిడిఎస్‌ అంగన్వాడీ కార్యకర్తలను ‘టెర్మినేషన్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్షంగా, జవాబుదారీతనం విస్మరించి ఉత్తర్వులు విడుదల చేసినట్లుగా తెలుస్తోందని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ఐసిడిఎస్‌ అధికారులకు తెలియజేసి వెంటనే డ్యూటీలో చేరకపోతే వారి ఉద్యోగాలను తొలగించాలని బెదిరింపులు చేస్తున్నట్లుగా తెలియవస్తోందని చెప్పారు. దీన్ని అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కి తీసుకుని, అంగన్వాడీల న్యాయ మైన సమస్యలు పరిష్కారానికి చర్చలకు పిలవాలని, లేకుంటే వైసిపి ప్రభుత్వ పతనానికి ‘అంగన్వాడి సమ్మె’ పునాది వేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఉపయో గించే ‘ప్రభుత్వ నల్ల చట్టం ఎస్మా’ ప్రయోగించడం చట్టబ ద్ధంగా చెల్లదని తెలిపారు. అంగన్వాడీ వర్కర్ల టర్మినేషన్‌ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ చర్యలు చట్టం తెలిసి కూడా చట్టాన్ని ఉల్లంఘించడమేనని, దీనికి పరిహారం, ప్రతికూల చర్యలు హైకోర్టు, సుప్రీంకోర్టులో తీర్పుల ద్వారా మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఏ.సత్తార్‌, జనతాదళ్‌ పార్టీ (సెక్యులర్‌), జిల్లా అధ్యక్షులు ప్రతాపరెడ్డి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్‌. శ్రీనివాసులు, లోక్సత్తా పార్టీ జిల్లా నాయకులు కష్ణ, సిపిఐ (ఎం.ఎల్‌) లిబరేషన్‌ జిల్లా నాయకులు రమణయ్య, జనతాదళ్‌ (యునైటెడ్‌), బి.ఎస్‌.పి, ఆర్‌.ఎస్పి. ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ.ఎన్‌.సుబ్బమ్మ, రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి, కడప నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి , ఓబులేసు పాల్గొన్నారు.

➡️