డిజిటల్‌ విద్యా విధానం అవసరం

మారుతున్న కాలానుగుణంగా డిజిటల్‌

పుస్తకాలను ఆవిష్కరిస్తున్న దేవానంద్‌ రెడ్డి

  • పరీక్షల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డి.డేవానంద్‌ రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మారుతున్న కాలానుగుణంగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ఉపాధ్యాయులు అలవరుచుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డి.దేవానంద్‌ రెడ్డి అన్నారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎపి సాంఘికశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి సాంఘికశాస్త్ర విద్యా, వైజ్ఞానిక సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవన గమనంలో సాంఘిక శాస్త్రం నైతిక విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నైతిక విలువల ఆవశ్యకత ఉందన్నారు. శ్రీకాకుళం రాష్ట్రస్థాయి సదస్సుకు వేదిక కావడం అభినందనీయమన్నారు. ఉప జిల్లా విద్యాశాఖాధికారులు ఆర్‌.విజయ కుమారి, జి.పగడాలమ్మ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తన బోధన ద్వారా విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించాలని కోరారు. వమరవల్లి డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.తిరుమల చైతన్య మాట్లాడుతూ ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతికత బోధనలో జోడించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన భారత పార్లమెంట్‌ భవన్‌ నమూనా, విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంఘిక శాస్త్ర ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫోరం తయారు చేసిన టీచింగ్‌ డైరీ, పాఠశాల రాజ్యాంగం అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్‌.వి కృష్ణారెడ్డి, కె.సురేష్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం చేస్తున్న కృషిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఫోరం జిల్లా అధ్యక్షులు వై.వి.రమణ అధ్యక్షత వహించిన సదస్సులో ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడాన రాజు, డిసిఇబి సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర నాయకులు శేఖర్‌, జి.మురళీమోహన్‌, ఎస్‌.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️