తడిసిమోపెడు..

తడిసిమోపెడు..

 

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోవటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వారానికే నోటిఫికేషన్‌ ఇచ్చి, నెల రోజుల్లో పోలింగ్‌ ప్రక్రియను ముగించేస్తారని భావించిన అభ్యర్థులు సుమారు రెండు నెలలు సాగే ఎన్నికల షెడ్యూల్‌ చూసి షాక్‌ అయ్యారు. ఇప్పుడు రెండు నెలలు సాగే ఎన్నికల ప్రక్రియతో పాటు ఖర్చు కూడా భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ సందిగ్ధంలో లోలోపల మధనపడిపోతున్నారు.అల్లూరి జిల్లాలో జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. వివిధ రూపాల్లో ఓటర్లను కలుసుకునేలా కార్యక్ర మాలు నిర్వహించారు. అభ్యర్థిగా ఖరారయ్యాక అందరినీ కలవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ముందు గానే ప్రచారాలు చేపట్టారు. ఏప్రిల్‌ రెండో వారంలో పోలింగ్‌ ఉంటుందన్న అంచనాతో అందుకు అనుగు ణంగా సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ఒక్క సారిగా వాతావరణం మారిపో యింది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడమే ఇందుకు కారణం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజు నుంచి 58 రోజులు ఉండడంతో అభ్యర్థులు అన్నిరోజులా అని అవాక్కయ్యారు. పోలింగ్‌ కు ఇంకా 45 రోజుల సమయం ఉండ డంతో అప్పటివరకు ప్రచారం ఖర్చులు, కార్యకర్తల వ్యయం, అనుచరగణాన్ని భరించడం ఎలాగనే ఆలోచనలో అభ్యర్థులు కొట్టిమిట్టాడుతున్నారు.అల్లూరి జిల్లాలో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అధికార పార్టీ, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్ని కల్లో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల నేతలు సర్వశక్తులూ ఒడ్డు తున్నారు. కొందరైతే ఎన్నికల కోడ్‌ వస్తే ఖర్చు చేసిన సొమ్ము లెక్కల్లోకి వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే ఆయా సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారితో టచ్‌ లో వున్నారు. వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరినీ ప్రసన్నం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. షెడ్యూల్‌ వచ్చినా ఏప్రిల్‌ రెండో వారంలో పోలింగ్‌ జరుగుతుందని అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ఖర్చులకు సొమ్ములు సిద్ధం చేసుకున్నారు. అనూహ్యంగా మే 13న పోలింగ్‌ తేదీ ప్రకటించడంతో మరో నెల రోజుల పాటు ఖర్చులకు సొమ్ములు సర్దుబాటు చేసుకోవాలని అభ్యర్థులు మదనపడుతున్నారు. ఎన్నికల ప్రచార రథాలు, నేతలకు వాహనాలు సమ కూర్చడం, కరపత్రాలు, జెండాలు, కార్యకర్తలకు భోజనాలు, అల్పాహారం ఇలా ప్రతిదానికి రూ.లక్షల్లో సొమ్ము ఖర్చవుతోంది. నెల రోజులు పెరిగినందున ఆ మేరకు ఖర్చు కూడా తడిసిమోపెడవుతుందన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతుంది.కార్యాలయాల ఏర్పాటుపై మీమాంసఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చాలాచోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుంచి కార్యకలాపాల నిర్వహణ, సమన్వయం చేసుకుంటారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ, మండల, డివిజన్‌ ల స్థాయిలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే వాటిని ఏర్పాటు చేస్తే అద్దెతో పాటు నిర్వహణ భారంగా మారుతుందని భావిస్తున్నారు.

➡️