తూతూమంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం

సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తున్న రామ్‌మనోహర్‌ నాయుడు

ప్రజాశక్తి- ఆమదాలవలస

సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతుంటే దానికి ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు తూట్లు పొడుస్తూ తూతూ మంత్రంగా కొనసాగిస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పురపాలక సంఘ పరిధిలో 6వ వార్డులో కాలింగమన్నయపేట, తెలగమన్నయ్యపేట, తురక పేట, కంచరానిపేట, సనపలవానిపేట, నందగిరిపేట, నాదనపురంలలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ వార్డు ప్రజలు తీవ్ర అసంతృప్తికి చెందారు. శాసనసభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో అభ్యర్థులకు ఓట్లు వేస్తామని, ఆమదాలవలస మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక ఓటు వేస్తామని కానీ తమను ఏ శాసనసభ్యుడు పట్టించుకోవడంలేదని, తమ సమస్యలు ఎవరికి చెప్పకోవాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. బుధవారం జరిగిన గడపగడపకు కార్యక్రమంలో శాసనసభ్యులు ఎవరూ పాల్గొనక పోవడంతో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తూతూ మంత్రంగా పాల్గొని చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నందగిరిపేటలో సగం ఇళ్లకు మాత్రమే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిన ఫైళ్లను ఇచ్చారని అలాగే కె. మన్నయ్యపేటలో ఫైళ్లను గడపలో విసిరేసి వెళ్లిపోయారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. నాదానపురం గ్రామానికి చెందిన పాతిన ఉషారాణి ఈ ఐదేళ్ల కాలంలో సంక్షేమ పథకాల వలన 7,40,668 రూపాయలు లబ్ధి చేకూరినట్లు ఫైల్‌ను వాలంటీర్లు ఆమెకు ఇచ్చారు. ఆ ఫైల్‌ను చూసిన ఆమె భర్త పాతిన వెంకటరమణ తమకు ఇంత లబ్ది చేకూరలేదని సామాజిక మాధ్యమాలలో పోస్టును పెట్టి ఎవరైనా ఇంత లబ్ధి చేకూరిందని నిరూపిస్తే వారికి రూ.20 లక్షలు నగదును ఇస్తానని తెలిపారు. చివరకు 9:30 గంటల సమయంలో రెవిన్యూ శాఖ మంత్రి తనయుడు ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు 6వ వార్డులో టి.మన్నయ్యపేటకు చేరుకొని మాజీ కౌన్సిలర్‌ చింతాడ వెంకటరమణ ఆధ్వర్యంలో కొంతమంది లబ్ధిదారులను కలిసి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి అక్కడ నుంచి వెనుతిరిగారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రవి సుధాకర్‌, వైసిపి నాయకులు చిట్టి జనార్దనరావు, అంబటి శ్రీనివాసరావు, బోర చిన్నం నాయుడు, సనపల రాజు, శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️