పాత్రికేయులపై దాడి అమానుషం

మాట్లాడతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పల నర్శ

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విలేకరులపై దాడులకు పూనుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస డిమాండ్‌ చేశారు. సిపిఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్న విలేకర్ల పైనా పత్రికా కార్యాలయాలపైనా భౌతిక దాడులకు పూనుకోవడం అనాగరికమని తెలిపారు. ప్రభుత్వ , వైఫల్యాలను ఎత్తి చుపించే బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. ఈనాడు దినపత్రిక కార్యాలయం, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌లపై దాడి చేయడం పాలకపార్టీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. ఈ ధోరణి మార్చుకోకపోతే ప్రజా ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై వైసిపి ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసించాలని, విధ్వంసాలతో మీడియాను బెదిరించలేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్ట్‌ పై దాడులు చేయడమే కాకుండా జైల్‌లో పెట్టి రిమాండ్‌ కూడా విధించిందని తెలిపారు.మోడీ ప్రభుత్వం తో జత కట్టి ఆ బాటలోనే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వ్యహరిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ఎల్‌.సుందరావు, నాయకులు దాస్‌ తదితరులు పాల్గొన్నారు ..

➡️