పార్లమెంట్‌కు పోటీ ఎవరు.?

           అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిధిలోని అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాలకు టిడిపి తరుపున అభ్యర్థులెవరన్నది చర్చ నడుస్తోంది. వైసిపి ఇప్పటికే రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు స్థానాలనూ బిసిలకే కేటాయించింది. టిడిపి ఇదే ఫార్ములాను పాటిస్తుందా లేక మార్పు చేస్తుందా అన్నది వేచిచూడాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి బిసిలకు కేటాయించగా, టిడిపి అనంతపురం పార్లమెంటు ఓసికి, హిందూపురం పార్లమెంటు బిసికి కేటాయించింది. ఈ రెండు చోట్లా టిడిపి ఓటమినే చవిచూసింది. ఈసారి ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులుగా టిడిపి తరుపున ఎవరుంటారన్న దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్పులు చేపడుతుందా లేక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులనే మరోమారు బరిలో దింపుతుందా అన్న దానిపై స్పష్టత లేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటి నుంచి టిడిపి అభ్యర్థులిద్దరూ పార్టీ కార్యక్రమాల్లోనూ అంత చురుగ్గా కనిపించలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. లోకేశ్‌ పాదయాత్ర సమయంలోనూ జెసి.పవన్‌కుమార్‌రెడ్డి జిల్లాలో కనిపించలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల సమయంలోనూ వారి కదలికలు కనిపిండచడం లేదు. దీంతో టిడిపి ఈసారి అభ్యర్థులను మార్పులు చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తంది. వైసిపి అనుసరించిన బిసి ఫార్ములానే టిడిపి అనుసరిస్తుందన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ మార్పుల్లో ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేస్తారన్నదే సర్వత్ర నడుస్తున్న చర్చ. వైసిపి బిసిలకే ఇచ్చినప్పటికీ సామాజిక తరగతుల మార్పులు చేపట్టింది. 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు నుంచి బోయ సామాజిక తరగతికి చెందిన తలారి రంగయ్యను దింపింది. హిందూపురంలో కురుబ సామాజిక తరగతికి చెందిన గోరంట్ల మాధవ్‌ను బరిలో నిలిపింది. ఈసారి మాత్రం అనంతపురం పార్లమెంటుకు శంకర నారాయణను తీసుకొచ్చింది. హిందూపురం పార్లమెంటుకు కర్నాటకు చెందిన బోయ శాంతమ్మను సమన్వయకర్తగా నియమించింది. ఈ ఇద్దరూ ఆయా నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అసెంబ్లీ స్థానాలకు కూడా సగం స్థానాలకు అభ్యర్థులను వైసిపి ఖరారు చేసింది. కాని టిడిపి ఇంకా అభ్యర్థులు ఒక్కరినీ ప్రకటించలేదు. మార్పులు, చేర్పులు చేస్తుందన్న ప్రచారం మాత్రం నడుస్తోంది. ఫిబ్రవరి నాలుగో తేదీన తొలి జాబితా విడుదల చేస్తుందని ప్రచారం నడుస్తోంది. అందులో అసెంబ్లీకి ప్రకటిస్తుందా లేక పార్లమెంటు కూడా ఉంటాయా అన్నది కూడా స్పష్టత లేదు. అభ్యర్థులను టిడిపి ఎప్పుడు ఖరారు చేస్తుందోనని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు అధికార వైసిపి అభ్యర్థులను ఖరారు చేసి జనంలోకి పోతుంటే టిడిపి ఇంకా ప్రకటించకపోవడంతో ఆశావహులు, అభ్యర్థుల్లోనూ అయోమయం నెలకొంది. ఎవరికి సీట్లు వస్తుయి.. ఎవరికి రావో తెలియక అధిష్టానం వైపు చూస్తున్నారు. త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలంటూ తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇటీవల బాహాటంగానే మాట్లాడటం కూడా చర్చనీయాంశమైంది.

➡️