మొదలుకావు..వలసలు ఆగవు..

Dec 23,2023 19:40

పాఠశాలలో ఉన్న కొద్దిమంది విద్యార్థులు

– తెరచుకోని సీజనల్‌ హాస్టళ్లు
– మండుతున్న వలస విద్యార్థుల కడుపులు
– పాఠశాలల్లో పడిపోతున్న హాజరు శాతం
ప్రజాశక్తి – హోళగుంద
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత పల్లెల్లో కరువు రక్కసికి విద్యార్థుల జీవితాలు బలైపోతున్నాయి. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా అధికారులు చూడాల్సి ఉంది. వలస విద్యార్థులను ఆదుకోవాల్సిన సీజనల్‌ హాస్టళ్లు అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు నెలలైనా జిల్లాలో ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థుల అక్షరాస్యతలో వెనుకబడిన ఆదోని డివిజన్‌పై శ్రద్ధ చూపాల్సిన అధికారులు ఆ దశగా చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా హోళగుంద మండల రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారు. తల్లిదండ్రులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పిల్లల చదువులకు ఆటంకంగా మారింది. డిసెంబర్‌లో వరి కోత పూర్తి కావడంతో వలసలు మరింత పెరిగాయి.
పడిపోతున్న హాజరు శాతం
మండలంలోని 38 పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కరువు నెలకొంది. ఈ కరువు ప్రభావం విద్యార్థుల చదువుపై పడింది. కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో 59 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 30 మందిలోపే హాజరవుతున్నారు. హోళగుంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1,846 మంది విద్యార్థులు ఉండగా 1,250 మంది మాత్రమే హాజరవుతున్నారు. గజ్జహల్లి, వందవాగిలి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇలా కొన్ని పాఠశాలల్లో 50 శాతం, మరి కొన్ని పాఠశాలల్లో 30 శాతంలోపు హాజరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే హాజరు శాతం మరింత పడిపోయే అవకాశం ఉంది.
తెరచుకోని సీజనల్‌ హాస్టళ్లు
తల్లిదండ్రులు వలస బాట పడుతుండగా ఇంటి దగ్గర పిల్లలకు భోజన వసతి ఇబ్బందిగా మారుతుందని పిల్లలను వెంట తీసుకెళ్తున్నారు. సీజనల్‌ హాస్టల్‌ అందుబాటులో ఉంటే పిల్లలు అందులో ఉండి చదువుకునే అవకాశాలు ఏర్పడేవి. ప్రతేడాది నవంబర్‌లోనే జిల్లావ్యాప్తంగా సీజనల్‌ హాస్టళ్లను తెరిచేవారు. సీజనల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించినా, స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నుంచి ఆదేశాల అందినా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గతేడాది నవంబర్‌లో జిల్లావ్యాప్తంగా 76 సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సీజనల్‌ హాస్టల్‌ కూడా ఏర్పాటు కాలేదంటే అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది.
పిల్లలను చదువు మాన్పించి వెంట తీసుకొచ్చాం
– నారాయణప్ప, గజ్జహల్లి
ఈఏడాది వర్షాలు కురవక పంటలన్నీ ఎండిపోవడంతో వలస వచ్చాం. పిల్లలను చదువు మాన్పించి మా వెంట తీసుకొచ్చాం. అక్కడ ప్రతేడాది సీజనల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది సీజనల్‌ హాస్టల్‌ తెరచుకోలేదని తెలిసి ఎక్కడ వదలాలో తెలియక మా వెంట తీసుకొచ్చాం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో సిమెంట్‌ పనులు చేయడానికి వలస వచ్చాం. అక్కడ ఉంటే రోజు తిండి కూడా దొరకదు. చేసిన అప్పులు తీరవు. ఇక్కడ మగవారికి రూ.600, ఆడవారికి రూ.400 కూలి ఇస్తున్నారు. ఇక్కడ తాగడానికి నీరు కూడా ఇబ్బందిగా ఉంది. సీజనల్‌ హాస్టల్‌ తెరచుకుంటే మా పిల్లలు అక్కడికి తీసుకొచ్చి వదులుతాం.
వెంటనే సీజనల్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలి
– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున
మండలంలో సీజనల్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలి. హాస్టల్స్‌ ఇంతవరకు తెరచుకోకపోవడం వల్ల విద్యార్థుల విద్య కుంటుపడుతుంది. హాజరు శాతం రోజురోజుకు పడిపోతోంది. జిల్లా అధికారులు స్పందించి వలస విద్యార్థులకు సీజనల్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలి.

➡️