విఆర్‌ఎలతో వెట్టిచాకిరీ

గౌరవ వేతనం పేరుతో ఏళ్ల తరబడి విఆర్‌ఎల

నిరసన దీక్ష చేపట్టిన విఆర్‌ఎలు

  • సమస్యలు పరిష్కరించకుంటే ఐక్య ఉద్యమం
  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు
  • కలెక్టరేట్‌ వద్ద విఆర్‌ఎల నిరసన దీక్ష

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

గౌరవ వేతనం పేరుతో ఏళ్ల తరబడి విఆర్‌ఎలతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, విఆర్‌ఎల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.సత్యనారాయణ విమర్శించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యాన విఆర్‌ఎలు కలెక్టరేట్‌ వద్ద గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న డిఎను 2018 నుంచి వారి వేతనాల్లో రికవరీ చేయడం అన్యాయమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్‌ రెడ్డి విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే అన్ని సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విఆర్‌ఎల సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి మాట్లాడుతూ విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలని, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వారికి విఆర్‌ఒ, అటెండర్‌, వాచ్‌మెన్‌, డ్రైవర్లుగా 30 శాతం ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. గతంలో రికవరీ చేసిన డిఎను తిరిగి చెల్లించాలని, పనిచేస్తూ మరణించిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షకు యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎం.వాగ్దేవి, టిడిపి నాయకులు గొండు శంకర్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. దీక్షలో విఆర్‌ఎల సంఘ నాయకులు ఎన్‌.సీతప్పడు, కె.జనార్థనరావు, బి.అప్పారావు, రాములమ్మ, మీనాక్షి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️