స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట నష్టపరిహారం ఇవ్వాలి

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట నష్టపరిహారం ఇవ్వాలి

పుట్లూరులో డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

 

ప్రజాశక్తి-పుట్లూరు

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి పంటకూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని, పంట నష్టపరిహారం గరిష్టంగా నాలుగెకరాల వరకూ ఇవ్వాలని, సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు, విత్తు వేయని రైతులకు రూ.30వేలు, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, వలసల నివారణకు ఉపాధి హామీ పథకం కింద పని 200 రోజులు పని కల్పించి రోజుకు రూ.600 ఇవ్వాలని, పట్టణాలు, నగరాల్లో ‘ఉపాధి’ పనులు పెట్టాలని, రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక కుటుంబాల విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, గ్రామాల్లో సంఘం కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.సూరి, మండల సహాయ కార్యదర్శి జి.చౌదరి, మండల నాయకులు పెద్దయ్య, భాస్కర్‌రెడ్డి, నాగభూషణ్‌, రామచంద్రారెడ్డి, దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.గుంతకల్లు రూరల్‌ : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం పట్టణంలోని కార్యాలయంలో తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంతోపాటుగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వ్యవసాయ పెట్టుబడులకు నూతన అప్పులు మంజూరు చేయాలన్నారు. అలాగే జీవో 5ను రద్దు చేసి పంటలు సాగు చేసిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.45 వేలు, సాగు చేయని రైతులకు రూ.30 వేలు చెల్లించాలన్నారు. గ్రామాల్లో 200 రోజులు ఉపాధి పనులు కల్పించి రోజుకు రూ.600 కూలి గిట్టుబాటు కల్పించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.10 లక్షల పరిహారం అందించాలన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మారుతీప్రసాద్‌, సాకే నాగరాజు, చంద్రశేఖర్‌, ఎస్‌కెఎం.బాషా, అబ్దుల్లా, కిష్టప్ప, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకీ, చెర్రీ, తదితరులు పాల్గొన్నారు.

➡️