Polavaram నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్
ప్రజాశక్తి-విజయవాడ : పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేత పత్రం ప్రకటించాలి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో పునరావాసానికి తీసుకున్న చర్యలపై వివరాలు అసమగ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.  గత పది సంవత్సరాలుగా నిర్వాసితులు అటు పునరావాసం లేక ఇటు ఉన్నచోట అభివృద్ధి లేక నానా అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. 2020- 2021 సంవత్సరాల్లో వచ్చిన వరదల్లో గ్రామాల గ్రామాలు మునిగిపోయాయని తెలిపారు. అప్పర్ స్ట్రేమ్ కాఫర్ డ్యాం పూర్తిగా మూసేసిన తర్వాత ఎన్ని అడుగుల్లో నీళ్లు నిలువున్నాయి? ఎన్ని గ్రామాలు మునిగాయి? అనే ప్రాతిపదిక మీద గ్రామాల సర్వే నిర్వహించి కాటూరు లెక్కలను తిరిగి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తాజా ధరల ప్రకారం నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలను ప్రకటించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం డ్యామ్ నిర్మాణంలో వెల్లడైన అవకతవకలు, సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ పాత్రను శ్వేత పత్రంలో వివరించాలని డిమాండ్ చేశారు. ఇది జాతీయ ప్రాజెక్టు అయినందువల్ల కేంద్ర ప్రభుత్వం, దాని ఆధ్వర్యంలోనీ ఏజెన్సీలు బాధ్యతలు నుంచి తప్పించుకోలేవని పేర్కొన్నారు. డ్యాం నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

➡️