తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

వేసవిలో ప్రజలకు

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • వేసవిలో ప్రతిరోజూ ‘ఉపాధి’
  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీటి పథకాలు పని చేయలేదనే ఫిర్యాదు ఒక్కటీ ఉండకూడదని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ అధికారులతో తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రణస్థలం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం మండలాల పరిధిలో భూగర్భ జలాల లభ్యత గురించి అడిగారు. నీటి నాణ్యతను గురించి పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమనే తేడా చూపకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి నీటి సరఫరా వ్యవస్థ ఆయినా పనిచేసేలా ఉండాలని, మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. నీటి కొరత ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద పెంచిన కూలితో ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఎక్కువ మంది ప్రయోజనాలు అందుకునేలా చూడాలని ఆదేశించారు. ఏడాదికి వంద రోజుల పని, రూ.300 కూలి జిల్లాలో 1.82 లక్షల మంది ఉపాధి హామీ లబ్ధిదారులకు అందుతుందని చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలకు టెంట్లు ఏర్పాటు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఎంపిడిఒలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్తగా ప్రతిపాదించిన పనులను గుర్తించి, ప్రతిరోజూ అన్ని పంచాయతీల్లో పనులు జరగాలన్నారు. వేసవిలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుందని, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ డి.వెంకటేశ్వరరావు, ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి, డిపిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జి.జె బెనహర్‌, వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజినీర్‌ పి.సుగుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️