గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది – పింఛన్లపై నీచ రాజకీయాలు

Apr 3,2024 23:47 #Chandrababu Naidu, #speech

– ఇంటి వద్దకు వెళ్లి అధికారులు పింఛను ఇవ్వలేరా?
– ప్రజాగళం రోడ్‌షోలో చంద్రబాబు
ప్రజాశక్తి-రావులపాలెం, రామచంద్రపురం :రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలుతోందని, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దోచుకుంటున్నారని టిడిపి అధినేత నానా చంద్రబాబునాయుడు విమర్శించారు. డాక్టర్‌ బిఆర్‌.కోనసీమ జిల్లా కొత్తపేట, రామచంద్రపురంలో బుధవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. రావులపాలెంలోని కెనాల్‌ రోడ్డులో, రామచంద్రపురంలోని ద్రాక్షారామం సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. పింఛనును మొదటిగా ఎన్‌టిఆర్‌ ప్రారంభించారని గుర్తు చేశారు. పెన్షన్ల పంపిణీపై ఈ ప్రభుత్వం నీచమైన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు పింఛన్లు ఇవ్వకుండా చేశారని, అధికారులు ఒక్క నెల కూడా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. పింఛను డబ్బులు వచ్చే వరకు వృద్ధులు, వికలాంగులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని కోరారు.వలంటీర్‌ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ వలంటీర్లు రాజకీయం చేస్తే వ్యతిరేకిస్తానన్నారు. పచ్చని కోనసీమ దోపిడీ ముఠాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. వైసిపి హయాంలో వ్యవసాయం, నీటిపారుదల, ఆక్వా రంగాలు కుప్పకూలాయని, వాటిని కాపాడే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కోనసీమలో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులను, ఎంపిని గెలిపించాలని అభ్యర్థించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదలుగా ఉన్న కాపులకు కూడా న్యాయం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనను పోగొట్టి సుపరిపాలన అందించేందుకు టిడిపి, జనసేన, బిజెపి కలిసి ముందుకు వచ్చామని విమరించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలుగు జాతిని కాపాడుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపి అభ్యర్థి గంటి హరీష్‌ మాధుర్‌, కొత్తపేట అసెంబ్లీ నియోజవర్గ అభ్యర్థి బండారు సత్యానంద రావు, పొలిట్‌ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు రెడ్డి అనంతకుమారి, జనసేన పార్టీ ఇంచార్జ్‌ బండారు శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

➡️