14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు : హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

Apr 28,2024 14:41

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు : శంషాబాద్‌ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రానున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత నాగోల్‌ స్టేషన్‌ సమీపంలో మొదటి స్టేషన్‌తో ప్రారంభమై, నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో స్టేషన్లు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ మార్గంలో మెట్రోరైలు ఎలైన్‌మెంట్‌, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు శనివారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కాలినడకన పరిశీలించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగోల్‌లో ఇప్పుడున్న స్టేషన్‌ సమీపంలోనే న్యూ నాగోల్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ ఎడమవైపు(ఎల్బీనగర్‌ మార్గంలో) వస్తుంది. ఈ రెండింటినీ కలిపేలా విశాలమైన స్కైవాక్‌ నిర్మించనున్నట్లు తెలిపారు. నాగోల్‌లో మూసీ వంతెన వద్ద మంచినీటి పైపులైన్లు, హెచ్‌టీ విద్యుత్తు లైన్లు ఉన్నందున మెట్రో ఎలైన్‌మెంట్‌ను 10మీటర్లు ఎడమ వైపు మార్చాలని, మూసీ పునరుజ్జీవ పనులకు ఇబ్బంది లేకుండా పొడవైన స్పాన్‌లు ఉండేలా ప్రణాళిక రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. బైరామల్‌గూడ, సాగర్‌ రోడ్‌ జంక్షన్‌లో బహుళ ఫ్లైఓవర్లు ఉండటంతో మెట్రో లైన్‌ ఎత్తు అసాధారణంగా పెరుగుతుంది. దీన్ని తగ్గించడానికి ఎలైన్‌మెంట్‌ను కుడివైపు మార్చాల్సి వస్తుందని, ఫ్లైఓవర్‌ కారణంగా చాంద్రాయణగుట్ట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ నిర్మాణం సవాల్‌గా మారనుందన్నారు.

స్టేషన్ల పేర్ల ఎంపికపై సలహాల స్వీకరణ
నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పలు ఫ్లైఓవర్ల కారణంగా స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యంగా మారిందని, ప్రైవేటు ఆస్తులు కనిష్ఠంగా సేకరించేలా జాగ్రత్తగా ప్రణాళిక వేయాలని అధికారులను మెట్రోరైలు ఎండీ ఆదేశించారు. మెట్రో రైలు స్టేషన్‌ స్థానానికి సంబంధించి, వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్‌ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచించారు. ఎండీ వెంట సీఈఈ డీవీఎస్‌ రాజు, సీఎస్‌టీఈ ఎస్‌.కె.దాస్‌, చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ మోహన్‌, జీఎం బీఎన్‌ రాజేశ్వర్‌, ఎస్‌ఈ వై.సాయపరెడ్డి, డీపీఆర్‌ కన్సల్టెన్సీ ఇంజినీరింగ్‌ నిపుణులు ఉన్నారు.

ఎల్బీనగర్‌ స్టేషన్‌లో తొలిసారిగా వాకలేటర్‌..
నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్‌ కుడివైపు ప్రతిపాదిత కామినేని ఆసుపత్రి స్టేషన్‌ వస్తుంది. తర్వాత వచ్చేది ఎల్బీనగర్‌ జంక్షన్‌ స్టేషన్‌. కూడలికి కుడివైపు వస్తుంది. ఇప్పుడున్న ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇందులోనే వాకలేటర్‌ (సమతలంగా ఉండే దీనిపై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా సౌకర్యం ఇప్పటివరకు నగరంలో ఎక్కడా లేదు.

➡️