ప్రధాన పార్టీలు దేవాంగులకు సీటు ఇవ్వాలి : దేవాంగ సమావేశం తీర్మానం

Jan 26,2024 00:01

ప్రజాశక్తి – వేటపాలెం
దేవాంగులకు చీరాల నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు సీటు కేటాయించాలని, అలా అవకాశం ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలబడి గెలిపించుకుంటామని దేవాంగ ప్రతినిధుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు దేవాంగ ప్రతినిధులు తెలిపారు. కులం, రాజకీయ ప్రాధాన్యత అంశంపై మండలంలోని దేశాయిపేటలోని చల్లా రామయ్య, కోట సుబ్బమ్మ కళ్యాణ మండపంలో దేవాంగ ప్రతినిధులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో దేవాంగులకు ప్రాతినిధ్యం అవకాశం కల్పిస్తే రాజకీయాలకు అతీతంగా దేవాంగ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఐక్యం కావాలని చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు కోరారు. టిడిపి సీనియర్ నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ సజ్జా చంద్రమౌళి తరువాత చీరాల రాజకీయాల్లో దేవాంగులకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో దేవాంగులకు అవకాశం కల్పిస్తే అందరూ ఐక్యంగా గెలిపించుకుంటామని అన్నారు. దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర మాట్లాడుతూ రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు సమాజంలో అభివృద్ధికి నోచుకోలేవని అన్నారు. రాజకీయం అభివృద్ధికి కలసి పనిచేయాలని కోరారు. మాజీ ఎంపీపీ చల్లా జనార్దనరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు దేవాంగులకు అవకాశం ఇస్తే అందరం కలసి ఆర్థికంగా అభ్యర్థికి అండగా ఉండి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో దేవల మనుబ్రహ్మ దేవాంగ సంఘం, బాపట్ల జిల్లా దేవాంగ సంఘం, శ్రీ జ్యోతిర్మయి దేవాంగ సమితి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జెడ్‌పిటిసి బండ్ల తిరుమలదేవి, గ్రామ సేనాధిపతులు, దేవాంగ కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.

➡️