ఆధ్యాత్మిక కేంద్రంలో అరాచకాలు విశ్వవిద్యాలయంలో విధ్వంసంబూర్జవ రాజకీయ కుట్రలకు తిరుపతి వేదిక

ఆధ్యాత్మిక కేంద్రంలో అరాచకాలు విశ్వవిద్యాలయంలో విధ్వంసంబూర్జవ రాజకీయ కుట్రలకు తిరుపతి వేదికప్రజాశక్తి- తిరుపతి సిటి: తిరుపతి అంటే ప్రపంచ వ్యాప్తంగా పరిచయం లేని ఊరు. ఆధ్యాత్మిక, విద్యా కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన నగరాన్ని బూర్జవ రాజకీయ పార్టీలు తమ కుట్రలకు వేదికగా చేసుకోంటోంది. ఆధ్యాత్మిక కేంద్రంలో అరాచకాలకు తెరలేపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా 8 విశ్వవిద్యాలయాలతో వెలుగుతున్న తిరుపతిలో రాజకీయ విధ్వంసానికి పూనుకోవడం శోచనీయం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ కక్షలు, కుట్రలు సరైనవి కావు. గత వారం రోజులుగా తిరుపతి వాసులు భయాందోళనతో కాలం గడుపుతుండడం గమనార్హం. శ్రీవెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న జిల్లా తిరుపతి. ఇక్కడికి ప్రతిరోజు దేశవిదేశాల నుంచి లక్షమందికిపైగా యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. సెలవు రోజుల్లో అయితే మరో 20 నుంచి 30 వేల మంది అదనంగా వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలువు నడుస్తున్నాయి. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో విహార యాత్రలు తగ్గాయి. పొలింగ్‌ తర్వాత తిరుపతి సందర్శనకు యాత్రికుల తాకిడి పెరుగుతుందని అందరు భావించారు. కానీ పోలింగ్‌ రోజు రాత్రి నుంచి జిల్లాలో జరిగిన విధ్వంసాలతో యాత్రికుల మాట అటుంచితే జిల్లా వాసులే భయాందోళనలో ఉన్నారు. పోలింగ్‌ రోజు ఒక పార్టీ ఏజెంట్‌ ప్రత్యార్ధి పార్టీ నాయకులు కొట్టడం, నాయకులపై, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగడంతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు రెచ్చగొట్టే ధోరణికి దిగాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన గొడవ చిలికిచిలికి గాలివానగా మారి. విశ్వవిద్యాలయాల్లో విధ్వంసం సృష్టించే స్థాయికి చేరింది. పోలింగ్‌ రోజు సోమవారం జిల్లాలో అర్ధరాత్రి వరకు కొన్నిచోట్ల పోలింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పలు కేంద్రాలను పరిశీలించారు. రామిరెడ్డిగారిపల్లి వద్ద వైఎస్‌పి ఏజెంట్‌పై టిడిపి కూటమి నాయకులు దాడికి పాల్పడడంతో గొడవ ప్రారంభమైంది. ఇరుపార్టీల నాయకుల రెచ్చగొట్టే దోరణితో వ్యవహరించారు. అదే రోజు సాయంత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత వైసిపి సర్పంచి చంద్రశేఖర్‌పై కూటమి నాయకులు దాడి చేశారు. అతని ఇంటిపై రాళ్లతో, కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న వైసిపి అభ్యర్ధి గాయపడిన వారిని పరామర్శించేందుకు వస్తుంటే టిడిపి కూటమి నాయకులు నడిరోడ్డుపై అతన్ని అడ్డగించి దాడికి పాల్పడ్డాడు. టిడిపి అభ్యర్ది కళ్లముందే వైసిపి అభ్యర్ధి కారును దగ్ధం చేశారు. మరో కారును ధ్వంసం చేశారు. అతనిపై దాడికి పాల్పడితే నలుగురు గన్‌మేన్ల భద్రతతో అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీంతో అధికార పక్షం కక్ష పెంచుకున్నట్లు ఉంది. పోలింగ్‌ మరుసటిరోజు మంగళవారం ఈవిఎంలన్ని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచే సమయంలో పోటీలోని అభ్యర్థులు రావడం సహజం. ఈ నేపథ్యంలో మహిళా వర్శిటీకి టిడిపి అభ్యర్ధి తన అనుచరులతో చేరుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న అధికార పార్టీ నాయకుల మద్య వాదోపవాదాలు జరిగాయి. ఉన్నట్టుండి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు గొడవలకు దిగారు. టిడిపి అభ్యర్ధి కారుపై వైసిపి నాయకులు దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. అభ్యర్థిపై దాడికి ప్రయత్నిస్తే అతను గన్‌మెన్‌ అడ్డుకోవడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అంతటితో గొడవ అగలేదు. ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బీరుబాటిళ్లు, రాడ్లు, కత్తులు, కర్రలు, సుత్తులతో కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. భద్రత కేంద్రమైన స్ట్రాంగ్‌ వద్దే ఇంత జరుగుతున్న పోలీసులు నిమ్మకుండడం గమనార్హం. వర్శటీ నుంచి ఒకరిపై మరోక్కొరు దాడులు చేసుకుంటూ పరుగులు తీశారు. దీంతో మహిళా వర్శిటీ సమీప ప్రాంతాల్లో సైతం ప్రజలు, షాపులు మూసివేసి, ఇళ్లకు తలుపులువేసి దాంకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంతా జరిగాక తీరిగ్గా పోలీసులు తమ బలగాలతో వర్శిటికి చేరుకున్నారు. రావడమే తమ ప్రతాపాన్ని చూపించారు. వర్శిటీ ప్రాంగాణంలో ఉన్న సిబ్బంది, స్థానికులు, ఆఖరికి మీడియాపై లాఠీలు ఝులిపించారు. సాయంత్రానికి కలెక్టర్‌, ఎస్‌పి అక్కడికి చేరుకుని పరిస్థితులను సమీక్షించి, జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్‌ ప్రకటించారు. ఘటనపై విచారణ చేపడుతాం. కారుకులను శిక్షిస్తామంటూ పేర్కొన్నారు. బూర్జవ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం తమ గాయాలకు చికిత్స తీసుకున్నారు. కానీ ఇరుపక్కాల దెబ్బలతిన్న కార్యకర్తలు, అభిమానులు ఇళ్లకు వెళ్లి ఎవ్వరికి చెప్పకోలేక బాధలను అనుభవించారు. స్థానికులు, ఉద్యోగులు, తమపై జరిగిన దాడికి ఇరుపార్టీల వారిని తిట్టుకోవడం తప్పా ఏమిచేయలేక పోయారు. జర్నలిస్టుల మాత్రం వారిపై జరిగిన దాడిని ఎస్‌పి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం శూన్యం. మునుపెన్నడు లేని విధంగా విశ్వవిద్యాలయాల్లో సీసాలు, కర్రలు, రాడ్లు, సుత్తులు, బ్యాట్లు, క్రికెట్‌ స్టిక్‌లతో దాడులు చేయడం, వాహనాలను పెట్రోల్‌ పోసి తగలపెట్టడం, దొరికిన వారిని దొరికినట్లు చావబాదడం శోచనీయం. ఇలాంటి విషసంస్కృతిని విశ్వవిద్యాలయాల్లోకి తీసుకురావడం దారుణం. రాజకీయ ప్రత్యర్ధులు తమ ఎత్తులకుపై ఎత్తులు ఓటర్లను మెప్పించేందుకు, ప్రజలను నమ్మించేందుకు చేయాలే తప్పా, పెత్తనం కోసం, ఎదుటివారిపై చేయి సాధించేందుకు దాడులకు దిగడం సరైనది కాదు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం, పాత సినిమాల్లో లాగా అంత అయ్యిపోయాక చివర్లో రావడం, లాఠీలకు పని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, నగరంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచి, ప్రజలకు భరోసా ఇచ్చి, భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు.

➡️