రమణీయం..రథోత్సవం

Apr 18,2024 22:03

ప్రజాశక్తి-వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి సాలకట్ల బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడి ఉత్సవర్లను శోభాయమానంగా అలంకరించి రథాన్ని అధిష్టించి తిరుమాఢవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. రథోత్సవం ముందు భక్తులు రామనామ స్మరణ, డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు, సంకీర్తనల నడుమ కోలాహలంగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూరనీరాజనాలు అందించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని తిరుమాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తర్వాత స్వామివారిని తిరుచ్చిలోకి వేంచేపు చేసి హారతి ఇచ్చారు. అంతకుముందు వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన, మొదటి గంట, శాత్తుమొర కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. రథోత్సవం అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం, కైంకర్యములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చింతల సాయిక్రిష్ణారెడ్డి, శ్రీయ రెడ్డి, కేశవ రెడ్డి, టిటిడి అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

➡️