పోలీసుల అదుపులో రైస్‌ పుల్లింగ్‌ ముఠా

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ : గుడి ముందు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మార్టూరు సమీపంలోని నాగరాజుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు,గ్రామస్తుల కధనం ప్రకారం… నాగరాజుపల్లి గ్రామంలోని లక్ష్మి నారాయణ స్వామి ఆలయంలోకి సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చిపోతున్నారు. ఫొటోలు,వీడియోలు తీసున్నారు. అక్కడ పరిస్థితులను డ్రోన్‌ కెమెరా ద్వారా రికార్డు చేస్తున్నారు. గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి గుడి వద్దకు వస్తున్న అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో తెలంగాణా రిజిస్ట్రేషన్‌తో ఉన్న మారుతి డిజైర్‌ కారు, యునికార్న్‌ బైక్‌ పై ఐదుగురు వ్యక్తులు ఆదివారం వచ్చారు. గుడిలోపలికి వెళ్లి ధ్వజస్తంభాన్ని తమ సెల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు వారిని మీరు ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో వారు పురాతన ఆలయాలను సందర్శించడానికి వచ్చామని, రాజుపాలెం వెళ్ళడానికి దారి తప్పి నాగరాజుపల్లి వచ్చామని పొంతన లేకుండా సమాధానం చెప్పారు. గ్రామస్తులను మాటల్లో పెట్టి అక్కడి నుంచి కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామానికి చెందిన దాసం అంజయ్య, జడ కోటయ్య, జడ కొండలు, తాత ఆదెయ్య, నిస్సంగి హనుమంతరావు మరి కొందరు గ్రామస్తులు బైకులపై వారిని వెంటాడారు. కొణిదెన సమీపంలో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఎఎస్‌ఐ శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకొని ఐదుగురు వ్యక్తులను మార్టూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులు పురాతన దేవాలయాల్లోని ధ్వజస్థంభానికి ఏర్పాటు చేసిన కలశాలకు అద్వితీయ శక్తులు ఉన్నాయని చెప్పి అమాయక ప్రజలను మోసగించి విక్రయించే రైస్‌ పుల్లింగ్‌ ముఠాగా అనుమానిస్తున్నారు

➡️