ఆత్మవిశ్వాసం

May 5,2024 05:58 #artical, #edit page, #self confidence

ప్రముఖ ఆంగ్ల కవయిత్రి ఎలిజబెత్‌ బారెట్‌ వికలాంగురాలు. నయం చేయలేని వ్యాధులతో బాధపడుతుంటుంది. తన భర్త రాబర్ట్‌ బ్రౌనింగ్‌ ఎప్పుడూ తనను ప్రేమించాలని కోరుకుంటుంది. తన కళ్లు చూసో, సున్నితమైన గొంతు చూసో లేక జాలితోనో కాకుండా… ఒక వ్యక్తిగా ప్రేమించినప్పుడు మాత్రమే అది నిజమైన ప్రేమ అవుతుంది. భౌతికమైన అందం చూసి ప్రేమిస్తే… అది మసకబారిపోవచ్చు. ఇలాంటి ప్రేమ, జాలి నాకొద్దు అని 1850లో ‘ఇఫ్‌ దౌ మస్ట్‌ లవ్‌ మి’ పేరుతో తన భర్తకు రాసిన పద్యాలలో కోరుకుంటుంది. సాధారణంగా అందాన్ని వ్యక్తీకరించడానికో, స్నేహాన్నో, ప్రేమనో చూపడానికో ఒక వ్యక్తి ముఖం మాత్రమే దోహదపడుతుందని నమ్మించే ప్రకటనల ఉదంతాలు అనేకం చూస్తున్నాం. ఈ సౌందర్య ప్రకటనలకు అనుగుణంగాలేని స్త్రీలు వివక్ష, వేధింపులు, సామాజిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ‘సౌందర్య లక్షణములో చేరని వెఱ్ఱి వికారము లేవియు లేవు. ఎవరి మతిమాలినతనము వానికి సౌందర్యము’ అంటారు పానుగంటి. కంటికి ఇంపుగా కనిపించేదే అందం అనుకుంటారు చాలామంది. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత మంచి మనిషైనా… వాటిని పక్కనపెట్టి ఎదుటి మనిషిలోని లోపాలను ఎంచుతూ అవమాన పరుస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ అమ్మాయి ప్రాచీ నిగమ్‌ ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నది.
ఇటీవల యుపి బోర్డు టాపర్‌ ప్రాచీ నిగమ్‌ టెన్త్‌లో- 98.5 శాతంతో టాపర్‌గా నిలిచింది. దీంతో ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ… ఆమె మిత్రులు అభినందనలు తెలిపారు. అయితే, ఆమె ముఖంపై వున్న అవాంఛిత రోమాల విషయం సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. నిజానికి ఇది ఆమె తప్పుకాదు… శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతే తప్ప. ఆ బాలిక ప్రతిభను, తెలివితేటలను ప్రశంసించడానికి బదులు, ఆమె ముఖంలో అందాన్ని వెతుకుతున్నారు. చదువే లోకం కాదు, అందానికీ కాస్త సమయం కేటాయించుకోవాలని, వ్యాక్సింగ్‌ చేయించుకోమన్న వెధవ కూతలతో విపరీతంగా ట్రోల్‌ చేశారు. బాడీ షేమింగ్‌ తెర మీదకు రావడంతో, తాను సాధించిన మార్కులు, పరీక్షల్లో తాను చూపిన ప్రతిభ అంతా కనుమరుగైంది. అయితే, ప్రాచీ తనను ఎగతాళి చేసిన ట్రోలర్లకు గట్టి కౌంటరే ఇచ్చింది. ‘అంతిమంగా లెక్కలోకి వచ్చేది మార్కులే తప్ప… ఆహార్యం కాదని’ వారి నోళ్లు మూయించింది. ‘చాణిక్యుడిని కూడా తన ఆహార్యం చూసి ఎగతాళి చేశారనీ, కానీ అది ఆయనను ప్రభావితం చేయలేద’ని ప్రాచీనిగమ్‌ గట్టిగానే జవాబు చెప్పింది. ఒక్క ప్రాచీనే కాదు… కేరళకు చెందిన శైజ- ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఆత్మ విశ్వాసంతో తన సమస్యను ఎదుర్కొని ‘మీసక్కరి’ పేరుతో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయింది. పంజాబ్‌ సింగర్‌ హర్నామ్‌ కౌర్‌- తన గడ్డంతో గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ప్రస్తుతం బాడీషేమింగ్‌ ఎదుర్కొంటున్న మహిళల కోసం స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తోంది. నిజానికి ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం నింపాలే తప్ప, కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ… వ్యక్తిత్వ హనానికి పాల్పడటం క్షంతవ్యం కాదు.
ఆ బాలికకు సంఘీభావం తెలపడం పేరిట వ్యాపారీకరణ తొంగిచూసింది. బోంబే షేవింగ్‌ కంపెనీ తమ వ్యాపారానికి అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నించింది. సంఘీభావం ముసుగులో ఆమె ఫొటోను కించపరిచే రీతిలోనున్న వ్యాఖ్యలతో ఫుల్‌పేజీ ప్రకటన ఇచ్చింది. గతంలో హిమాలయా ఫేస్‌ వాష్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ఉత్పత్తులు కూడా నల్లగా వున్నవారిని అవమానించేలా ప్రకటనలు ఇచ్చి, తర్వాత వివాదాలు రావడంతో వెనక్కు తగ్గాయి. ఇప్పుడు బోంబే షేవింగ్‌ కంపెనీ కూడా అలాగే వెనక్కు తగ్గింది. అందంగా కనబడాలంటూ బడా కార్పొరేట్‌ సంస్థలు రకరకాల రూపాలలో, లాభాపేక్షే లక్ష్యంగా ఈ తరహా ప్రకటనలిస్తుంటాయి. ‘శవాలతో వ్యాపారం చేసేవారు/ ధర్మాన్ని రక్షించే వారెలా అవుతారు?/ వీరిని మానవులుగా భావించడమే అన్యాయం’ అంటారు మలాలా. పతంజలి ఉత్పత్తుల పట్ల సుప్రీంకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రజలను మోసపుచ్చే ప్రకటనలిస్తూనే వున్నారు. నెస్లే వంటి ఆహార పదార్థాలు హానికరం అని తెలిసినా, వాటి ఉత్పత్తి ఆగదు. మనకు తెలియకుండానే వారి ఆలోచనల్లో, వారి భావజాలంలో కొట్టుకుపోయేలా చేస్తున్నారు. దీని నుంచి జనం బయటపడాలి. ఆత్మన్యూనతా భావనల్లోకి నెట్టబడుతోన్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపాలి.

➡️