‘ఎస్‌ఒఎస్‌ సేవలు ప్రశంసనీయం’

Jun 24,2024 00:04 #sos Childrens home
sos Childrens

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ఎస్‌ఒఎస్‌ చిల్డ్రన్స్‌ విలేజ్‌ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ఎస్‌ఒఎస్‌ చిల్డ్రన్స్‌ విలేజ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెర్మన్‌ మైనర్‌ జయంతి సందర్భంగా స్థానిక ఎస్‌ఒఎస్‌ చిల్డ్రన్స్‌ విలేజ్‌లో ఆదివారం 60వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్‌ హెర్మన్‌ మైనర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జి.జయదేవి హాజరై మాట్లాడారు. సమాజ ఉన్నతిలో తల్లి పాత్ర బహుముఖమైనదన్నారు. ఇక్కడున్న పిల్లలు తల్లుల ప్రేమ, అనురాగం పొందడమే గాకుండా జీవితంలో ఉన్నతులుగా ఎదుగుతుండడం గర్వంగా ఉందన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన జిల్లా ప్రోహిబిషన్‌, జువైనల్‌ సంక్షేమ శాఖ అధికారి ఎం.శరత్‌బాబు మాట్లాడుతూ, నిబద్ధత గల ఉద్యోగులు, సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ వాటన్నింటికీ భిన్నమైనది ఎస్‌ఒఎస్‌ అన్నారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ఎల్‌ రాధ మాట్లాడుతూ, ఇక్కడి పిల్లలు ఉన్నతోద్యోగాల్లో స్థిరపడాలని ఆకాక్షించారు. చిల్డ్రన్స్‌ విలేజ్‌ ఇంఛార్జి సి.మణికంఠన్‌, కుటుంబ బలోపేత కార్యక్రమం ఇంఛార్జి కె.దుర్గరాజు, సిబ్బంది ఆర్‌.కృష్ణవేణి, జాన్‌ పీటర్‌, ఆర్‌ఎస్‌ నాయక్‌, సంజరు. తల్లులు, 250 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు చేతి గడియారాలు, ట్రావెలింగ్‌ బ్యాగ్‌లను బహూకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

➡️