భద్రతా వలయంలో విజయవాడ

May 8,2024 13:31 #pm
  • నేడు రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ ప్రధాని మోడీ రోడ్ షో
    5 వేల మందితో భారీ బందోబస్తు
    ప్రజాశక్తి-విజయవాడ
    దేశ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారంనాడు విజయవాడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్‌డిఎ అభ్యర్థుల కోసం ఆయన విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులో ఇందిరాగింధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ రోడ్‌షోలో పాల్గంటారు. తొలుత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన విజయవాడ చేరుకుంటారు. రోడ్‌షో అనంతరం తిరిగి విమానాశ్రయం చేరుకొని ఢిల్లీకి బయల్దేరి వెళతారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిజిపి ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ పిహెచ్‌ఎ.రామకృష్ణ నగరంలో ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆంద్రా లయోలా కళాశాల స్టేడియంలో బందోబస్త్‌ విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆరుగురు ఐపిఎస్‌ అధికారుల నేతృత్వంలో ఏడుగురు డిసిపిలు, ఎస్‌పిలు, 22 మంది ఎడిసిపిలు, 50 మంది ఎసిపిలు, 136 మంది సిఐలు, 250 మందిఎస్‌ఐలు, సిబ్బందితో కలిపి మొత్తం 5 వేల మంది లా ఆర్డర్‌, ఎఆర్‌,ఎపిఎస్పి, పారామిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత, పటిష్టబందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విజయవాడ నగరానికి అన్ని వైపులా రహదారి మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విజయవాడ నగరవ్యాప్తంగా వేలాది పోలీసులను మోహరింపజేశారు. ఐజిపి కె.వి.మోహన్‌రావు, డిఐజి గోపీనాథ్‌ జెట్టి, ఎఐజి ఎం.రవీంద్రనాథ్‌ బాబు, వకుల్‌ జిందాల్‌, మల్లికా గార్గ్‌, ఏ.ఆర్‌.దామోదర్‌, డిసిపిలు కె.శ్రీనివాసరావు,అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఎబిటిఎస్‌.ఉదయరాణి, కరిముల్లా షరీఫ్‌,కె.చక్రవర్తి, టి.హరికష్ణ, బి.రామకృష్ణ, ఎడిసిపిలు, ఎపిసిలు, సిఐలుతదితరులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎంజిరోడ్డులో పూర్తిగా రాకపోకలు నిషేధంమహాత్మాగాంధీరోడ్డులో ఠాగూరు గ్రంథాలయం ఎదురు సిగల్‌ వద్ద బారీకేడ్లతో రోడ్డును మూసివేశారు. పిఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్డుపై సరికొత్తగా పోల్స్‌ ఏర్పాటుచేసి జెండాలు పాతారు. జనాలు రాకుండా ఉండేందుకు ఇనుప పోల్స్‌ను ఏర్పాటుచేశారు. ఎంజి రోడ్డులో దుకాణాలు తెరవకుండా ముందస్తుగానే పోలీసులు ఆదేశాలు జారీచేశారు. తెరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బుధవారంనాడు ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ఎంట్రన్స్‌ పరీక్షలు కూడా ఉండటంతో విజయవాడ కేంద్రంగా పరీక్షలు రాసే వారు ట్రాఫిక్‌ ఆంక్షలతో నానా ఇబ్బందులు పడ్డారు.
➡️